రైతన్న మీకోసం’ కార్యక్రమం ప్రారంభం.
ఈనెల 27 వరకు ప్రతి ఆర్ఎస్కే పరిధిలో రైతులకు అవగాహన.
ఏపీఏఐఎంఎస్ యాప్ తో యూరియా, డీఏపీ పంపిణీ: ఎంఏవో సురేష్.
కంచిలి మండల పరిధిలో సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కొంకేన సురేష్ తెలిపారు. రైతు కుటుంబాలను కలిసి ఏపీఏఐఎంఎస్ యాప్ తో యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీపై అవగాహన కల్పిస్తామన్నారు. కంచిలి మండలం సోమవారం బొగాబెని రైతు సేవా కేంద్రం పరిధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యూరియాను విచక్షణారహితంగా వాడకుండా మట్టి నమూనా విశ్లేషణ పత్రంలో సిఫారసు చేసిన మోతాదులోనే వాడుకోవాలని సూచించారు.
నేల ఆరోగ్యానికి సూచనలు:
సేంద్రియ కర్బనం పెంచేందుకు చివికిన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వానపాముల ఎరువులు వాడాలని, జింకు, ఇనుము వంటి సూక్ష్మ పోషక లోపాలను సవరించుకోవాలని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావం:
వర్షాభావ పరిస్థితులను తట్టుకునే అపరాలు, నూనెగింజలు, చిరుధాన్యాల పంటలు విత్తుకోవాలని అవగాహన కల్పించారు.
నానో ఎరువులు:
యూరియా, డీఏపీ స్థానంలో నానో యూరియా, నానో డీఏపీలను డ్రోన్ ద్వారా పిచికారి చేస్తే మొక్కకు అవసరమైన నత్రజని, భాస్వరం అందుతాయని వివరించారు. అనంతరం ‘డి కృషి’ యాప్ ద్వారా రాయితీపై వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ పైల పురుషోత్తం రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు జీవిత, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
