Homeఆంధ్రప్రదేశ్మన బడి – మన భవిష్యత్

మన బడి – మన భవిష్యత్

KANCHILI : ఏఎస్‌పల్లి గ్రామ పాఠశాలలో అదనపు భవనం అవసరాన్ని గుర్తిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన.

“మన బడి – మన భవిష్యత్”తో ఏఎస్‌పల్లి పాఠశాలకు అదనపు భవనం ఆశలు.

విద్యార్థుల అవసరాలపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న “మన బడి – మన భవిష్యత్” పథకం మరో ప్రభుత్వ పాఠశాలకు ఊరటనివ్వనుంది.   కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ పరిధిలోని ఏఎస్‌పల్లి గ్రామ పాఠశాలలో అదనపు భవనం అవసరాన్ని గుర్తిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదుల అవసరాన్ని గ్రామస్థులు గుర్తించి, ఏప్రిల్ 15న సమగ్ర శిక్ష అభియాన్ శ్రీకాకుళం జిల్లా అధికారులకు అర్జీ సమర్పించారు. ప్రజల వినతిపై స్పందించిన అధికారులు సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో ఫీల్డ్ ఇంజినీర్ రవికుమార్,  ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి,  పాఠశాల హెచ్‌ఎం లక్ష్మణ్ కలిసి పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.   ప్రస్తుతం పాఠశాలలో 51 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,   ఈ నేపథ్యంలో ఫేజ్-2లో  “మన బడి – మన భవిష్యత్” పథకం ద్వారా ఒక అదనపు భవనం మంజూరైనట్లు అధికారులు తెలిపారు.

రానున్న విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున మరో అదనపు భవనం అవసరాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.   దీనిపై ఫీల్డ్ ఇంజినీర్ సానుకూలంగా స్పందిస్తూ పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.   త్వరలోనే పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు పేర్కొన్నారు.

గ్రామీణ విద్యార్థులకు  మెరుగైన  మౌలిక  వసతులు కల్పించేందుకు  ప్రభుత్వం తీసుకుంటున్న  చర్యలు ప్రభుత్వ  పాఠశాలలపై  ప్రజల్లో  విశ్వాసాన్ని పెంచుతున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.  విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామస్థులు,  అధికారులు,  ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సహకరించిన ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు,  కంచిలి మండల టీడీపీ అధ్యక్షుడు మదీనా రామారావుకు,  ఏఎస్‌పల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి,  పాఠశాల హెచ్‌ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular