Homeఆంధ్రప్రదేశ్మూడుముళ్లు వేసిన చేతులతోనే ఉరితాడు బిగించారు.

మూడుముళ్లు వేసిన చేతులతోనే ఉరితాడు బిగించారు.

SRIKAKULAM : బాజాభజంత్రీల కోలాహలం మధ్య పెళ్లిపల్లకీ ఎక్కిన ఆమె.. శుక్రవారం సన్నిహితుల రోదనల మధ్య పాడె ఎక్కింది.

పెళ్లయిన రెండు నెలలకే వందేళ్ల జీవితాన్ని ఆర్పేశారు.

విశాఖ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. కేసు నమోదు.

రెండు నెలల క్రితం బంధుమిత్రుల హర్షాతిరేకాలు,  బాజాభజంత్రీల కోలాహలం మధ్య పెళ్లిపల్లకీ ఎక్కిన ఆమె..  శుక్రవారం సన్నిహితుల రోదనల మధ్య పాడె ఎక్కింది.   అక్షింతలు వేసి దీవించిన చేతులే ఆమె మృతదేహంపై చివరిసారి పూలు చల్లాల్సి వచ్చింది.  అగ్నిసాక్షిగా వేయించుకున్న మూడుముళ్లు సీను కళ్ల ముందు నుంచి చెదిరిపోకముందే ఆ నవవధువు పాలిట ఉరితాడులా మారాయి.   వందేళ్లు వర్థిల్లమని పెద్దలు ఇచ్చిన దీవెనలు అత్తింటి వరకట్న దాహం ధాటికి శక్తి కోల్పోయాయి.    చివరికి కలలు తీరకుండానే ఆ అమాయకురాలు మరో లోకానికి తరలిపోయింది.    శ్రీకాకుళం రూరల్ మండలం శిమ్మపేటకు చెందిన వ్యవసాయ కూలీలు లక్ష్మీనారాయణ,   శారదల కుమార్తె శిమ్మ తేజశ్రీ (22)ని రాగోలు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన రుప్ప సోమేశ్వరరావుకు ఇచ్చి ఈ ఏడాది మార్చి ఆరో తేదీన అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.   నూతన దంపతులు విశాఖ నగరంలోని రామాటాకీస్ సమీపంలో కాపురం పెట్టారు.   కానీ ఏం జరిగిందో ఏమో గానీ.. రెండు నెలలు తిరక్కుండానే కాపురం ఉంటున్న ఇంట్లోనే ఈనెల ఏడో తేదీన తేజశ్రీ విగతజీవిగా మారిపోయింది.

విభేదాలు, వేధింపులు: 
వివాహ సమయంలో తేజశ్రీ తరఫున అత్తివారికి వరకట్నం కింద రూ.16 లక్షల నగదు, 20 తులాల బంగారం, రూ.10 లక్షల విలువైన ఇతర కానుకలు సమర్పించుకున్నారు.   బీటెక్ చదివిన వరుడు సోమేశ్వరరావు ఎల్ అండ్ టీ సంస్థలో ఉద్యోగం చేస్తూనే రామాటాకీస్ సమీపంలో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.   వివాహం అనంతరం అక్కడికి దగ్గర్లోనే అద్దె ఇంట్లో నవ దంపతులు కాపురం పెట్టారు. కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండే నవ వధువు తేజశ్రీకి వేధింపులు ప్రారంభమయ్యాయి.   దంపతుల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండడంతో ఇరు కుటుంబాలవారు కలిసి పలుమార్లు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

అయితే సోమేశ్వరరావు తరచూ వేరే మహిళలను ఇంటికి తీసుకురావడం,  ప్రశ్నిస్తే భార్యను కొట్టడం చేస్తుండేవాడు.    మరోవైపు అదనపు కట్నంగా శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడలో తేజశ్రీ కుటుంబానికి ఉన్న భూమిని తన పేరిటి రాయించాలని భర్త సోమేశ్వరావు,  ఆయన కుటుంబ సభ్యులు కలిసి తేజశ్రీని వేధించడం ప్రారంభించారు.

ఈ క్రమంలో ఈనెల ఏడో తేదీ ఉదయం తేజశ్రీ యోగక్షేమాలు కనుగొనేందుకు తల్లిదండ్రులు ఫోన్ చేశారు.  ఫోన్ రింగ్ అయినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు.  దాంతో అల్లుడు సోమేశ్వరరావుకు ఫోన్ చేస్తే  ‘మీ కుమార్తె ఉరి వేసుకొని మృతి చెందింది’  అని చావు కబురు చల్లగా చెప్పాడని తేజశ్రీ మేనమామ చెప్పుకొచ్చారు.  దాంతో కుటుంబ సభ్యులు విశాఖలోని కుమార్తె ఇంటికి తరలివెళ్లారు.   ఆ సమయంలో శరీరం నిండా గాయాలతో తేజశ్రీ మృతదేహం మంచంపై ఉందని తెలిపారు.   భర్తే తేజశ్రీని ఉరి వేసి హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు విశాఖపట్నం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి తేజశ్రీ భర్త సోమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.

తేజశ్రీ మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని శిమ్మపేటకు తీసుకురాగా గ్రామస్తులు ఆశ్రునయనాలతో భారీగా అంతిమ యాత్ర నిర్వహించి అంతిమ సంస్కారాలు జరిపారు.  తేజశ్రీది ముమ్మాటికే హత్యేనని, నిందితుడు సోమేశ్వరరావుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని యువత, మహిళలు నినాదాలు చేశారు.

RELATED ARTICLES

Most Popular