రోడ్డు ప్రమాదం సృష్టించి, దాడి చేసి, కిడ్నాప్ చేసి నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ – ఆటో, ద్విచక్ర వాహనం, మూడు స్మార్ట్ ఫోన్లు, నగదు స్వాధీనం – కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్.
క్రైమ్ నంబర్ 337/2026, సెక్షన్లు 309, 137(2), 125(b) r/w 3(5) BNS ఆఫ్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్.
పలాస మండలం రామకృష్ణాపురం సమీపంలో జాతీయ రహదారి NH-16పై జరిగిన ఘటనకు సంబంధించి, ఫిర్యాదుదారుడిపై దాడి చేసి, అతని ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను లాక్కొని, కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి ఆన్లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్న ఇద్దరు నిందితులను కాసిబుగ్గ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసు వివరాలు:
నిందితులైన A-1 కిర్రి సాయికృష్ణ (23), పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం ప్రాంతానికి చెందినవాడు కాగా, A-2 గొర్లె రవితేజ (20), పలాస మండలం కొత్తవూరు గ్రామానికి చెందినవాడు. వీరిద్దరూ గతంలో పలాస ZPH పాఠశాలలో కలిసి చదువుకోవడంతో స్నేహితులుగా ఉంటూ, కలిసి తిరుగుతూ అప్పుడప్పుడు మద్యం సేవించేవారు. తమ వ్యసనాల కోసం డబ్బు అవసరం కావడంతో తక్కువ సమయంలో అక్రమంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
తేదీ 11.10.2026 తెల్లవారుజామున సుమారు 03.15 గంటలకు ఇచ్చాపురం వైపు నుంచి శ్రీకాకుళం వైపు NH-16 మీదుగా ప్రయాణిస్తున్న ఫిర్యాదుదారుడి ద్విచక్ర వాహనాన్ని A-1 తన ఆటోతో ఢీకొట్టినట్లు, అనంతరం ఫిర్యాదుదారుడిపై దాడి చేసి అతని సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని లాక్కొని, అతనిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి A-1 ఇంటికి చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్కడ ఫిర్యాదుదారుడిని బెదిరించి, అతని ఫోన్‌పే ఖాతా నుంచి A-1 ఫోన్‌పే ఖాతాకు రూ.80,000/- మరియు A-2 ఫోన్‌పే ఖాతాకు రూ.8,550/- చొప్పున మొత్తం రూ.88,550/- బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలాస పోలీసులు Cr.No.337/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తేదీ 13.10.2026 సాయంత్రం 05.30 గంటలకు A-1 ఇంటి వద్ద A-1 కిర్రి సాయికృష్ణ, A-2 గొర్లె రవితేజలను అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
ఒక ఆటో
ఒక ద్విచక్ర వాహనం
మూడు స్మార్ట్ ఫోన్లు
నగదు రూ.18,550/-
ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజలు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడకుండా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్ అధికారి సూచించారు.
