బూరగాంలో మన్యం వీరుడికి ఘన నివాళులు.. యువతకు దేశభక్తి సందేశం.
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, గిరిజనుల్లో స్వాతంత్ర్య జ్యోతిని రగిలించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా కంచిలి మండలం బూరగాం గ్రామంలో గురువారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొనగా, అల్లూరి విప్లవ పోరాట గాథలను స్మరించుకుంటూ పలువురు నాయకులు, మేధావులు ఆయన సేవలను కొనియాడారు.
బొట్ట శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మడ్డు సర్వేశ్వరరావుతో కలిసి అల్లూరి సీతారామరాజు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు అల్లూరి పోరాటం కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదని, అది నేటి తరానికి స్ఫూర్తినిచ్చే జాతీయ చైతన్యమని పేర్కొన్నారు.
బద్రి నాగేశ్వరరావు, బొడ్డు అప్పారావు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు మాస్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల దమనకాండకు ఎదురొడ్డి అల్లూరి చూపిన ధైర్యసాహసాలు, యుద్ధ వ్యూహాలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని వివరించారు. అణగారిన గిరిజనుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి స్వేచ్ఛ కోసం ఆయుధం ఎత్తిన మహానాయకుడిగా అల్లూరిని అభివర్ణించారు.
“దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల చరిత్రను గుర్తుంచుకోవడం ప్రతి తరానికి బాధ్యత” అని వక్తలు పేర్కొంటూ, యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ, దేశభక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కప్ప మీనారావు, బొట్ట తేజేశ్వర్, బద్రి ఢిల్లీరావు, బద్రి లోకనాధం, పిల్లల లింగరాజు, మద్దిల హేమసుందరరావు తదితరులు పాల్గొన్నారు.
