అభయం ప్రోగ్రాం ను ప్రారంభించిన కాశీబుగ్గ డిఎస్పీ.
హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాస లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాశీబుగ్గ డిఎస్పీ టి.భవాని ఆధ్వర్యంలో అవగాహన బైక్ ర్యాలీ ని నిర్వహించారు.

ఈసందర్భంగా కాశీబుగ్గ డిఎస్పీ టి.భవాని మాట్లాడుతూ…రోడ్డుప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. జిల్లాలో హెల్మెట్ ధరించనివారిపై ఫైన్ లు విధిస్తున్నప్పటికీ 5 శాతం వాహనదారులు కూడా హెల్మెట్ ఉపయోగించడం లేదని, అందుకే జిల్లా ఎస్పీ కే.మహేశ్వర రెడ్డి ఆదేశాలమేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాశీబుగ్గ పోలీస్ ఆధ్వర్యంలో అభయం ప్రోగ్రాం ను ప్రారంభించి హెల్మెట్ బ్యాంక్ ను నెలకొల్పామని తెలిపారు. ఎవరైతే హెల్మెట్ లేకుండా పట్టుబడతారో వారికి హెల్మెట్ ఇవ్వబడుతుందని 48 గంటల్లోగా సొంత హెల్మెట్ ధరించి పోలీసులు ఇచ్చిన హెల్మెట్ ను తిరిగి పోలీస్ స్టేషన్ కు అప్పగించాలని, ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగమేనన్నారు.

ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలతోపాటు తమ కుటుంబం రోడ్డున పడకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు.
కాశీబుగ్గ మూడురోడ్ల కూడలి నుండి పలాస సమీప జాతీయరహదారి వరకు కొనసాగిన బైక్ ర్యాలీ లో డిఎస్పీ టి.భవాని, సి.ఐ రామకృష్ణ తోపాటు పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
