నలుగురు డ్రాప్‌అవుట్ చిన్నారులు మళ్లీ బడిబాట
కంచిలి మండలంలోని మకరంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నలుగురు డ్రాప్‌అవుట్ చిన్నారులకు పాఠశాల ప్రవేశం కల్పించారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వచ్చి ఎన్‌హెచ్–5 ఆదివారం సంత ప్రాంతంలో తాత్కాలికంగా నివాసం ఉంటూ వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయించే వలస కుటుంబాలకు చెందిన చిన్నారులు వీరు.
మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ–2) కె. చిట్టిబాబు సమక్షంలో చిన్నారులను పాఠశాలలో చేర్పించారు. ప్రతి చిన్నారి విద్యకు దూరం కాకుండా చూడటం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. వలస కుటుంబాల పిల్లలకు కూడా విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెయ్యిల హరికృష్ణ మాట్లాడుతూ, చదువుకు దూరమైన చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలో చేర్పిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుద్ది బాలరాజు, మాధవి, స్వరూప, భవాని, సునీత,సీఆర్పీ వజ్జ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
