పాఠశాల ఆవరణలో కూరగాయల సాగు చేయాలని ఎంఈవో రామకృష్ణ సూచన.
KAVITI : కవిటి మండలం బోరివంక క్లస్టర్ పరిధిలోని ఎనిమిది పాఠశాలలకు కూరగాయల సాగు ప్రోత్సాహం కోసం గ్రో బ్యాగులు, విత్తనాలు, కంపోస్ట్ ఎరువులు, కొబ్బరి పీచు (కోకోపిట్) పంపిణీ చేసినట్లు ఎంఈవో-2, కాంప్లెక్స్ చైర్మన్ ఎస్. రామకృష్ణ తెలిపారు. ఈ సామగ్రిని పాఠశాల ఆవరణలో వినియోగించి కూరగాయలు సాగు చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు స్వయంగా కూరగాయల సాగు విధానాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే వ్యవసాయంపై అవగాహన పెంచడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఆర్ఎమ్ బి. తులసిదాస్, హెచ్ఎంలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
