బాధితులకు అండగా నిలిచి ఇరువర్గాల మధ్య సామరస్యపూర్వక రాజీ కుదిర్చిన హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (H.R.E.C.I)
NARASANNAPETA : శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, నరసన్నపేట పట్టణానికి చెందిన శ్రీమతి దానాల పుష్పలత, భర్త దుర్గాప్రసాద్, గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సుమారు రూ.40 లక్షల మేర అప్పుల భారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో నరసన్నపేటకు చెందిన శ్రీమతి ముద్దాడ రవలి, భర్త ఆదినారాయణ, అలాగే ఇతర రుణదాతలు బాకీలు చెల్లించాలని, ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం బాధితురాలు శ్రీమతి పుష్పలత 04-06-2026 తేదీన హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (H.R.E.C.I) ని ఆశ్రయించారు.

విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న H.R.E.C.I, సంస్థ జాతీయ చైర్మన్ శ్రీ ఈదురు పద్మాకర్ సూచనలు మేరకు, ఆంధ్ర మరియు ఒడిశా రాష్ట్రాల ఇన్చార్జ్ చైర్మన్ డాక్టర్ కె చిన్నవాడు ఆధ్వర్యంలో ఇరువర్గాల పెద్దలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పలుమార్లు చర్చలు నిర్వహించింది. పరస్పర అవగాహనతో, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేసి, ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చింది.
బాధితురాలు శ్రీమతి పుష్పలత ఆర్థిక పరిస్థితిని, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఆమె విజ్ఞప్తి మేరకు రెండు సంవత్సరాల గడువు కల్పించే విధంగా పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఆమెపై ఉన్న తక్షణ ఆర్థిక, మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గి, కుటుంబానికి ఊరట లభించింది.
ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ సమస్యను శాంతియుతంగా, చట్టబద్ధంగా, పరస్పర గౌరవంతో పరిష్కరించిన హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (H.R.E.C.I) కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో శాంతి, సామరస్యం, మానవ విలువలను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (H.R.E.C.I) సమాజంలో బాధితులకు అండగా నిలుస్తూ, చట్టబద్ధమైన మార్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మానవ హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటుందని హ్యూమన్ రైట్స్ మాన్ ఫోర్స్ మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర మరియు ఒడిస్సా రాష్ట్రాల ఇన్చార్జ్ చైర్మన్ డాక్టర్ కె చిన్నవాడు తెలిపారు. మరియు ఈ కార్యక్రమంలో పెద్దలు భేవర రాము , HRECI జోనల్ జనరల్ సెక్రెటరీ మొయ్య జగన్నాథం, శ్రీకాకుళం జిల్లా జనరల్ సెక్రెటరీ పంగ శివయ్య, జిల్లా ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలసముద్రం రాజారావు మొదలగువారు పాల్గొన్నారు
