కంచిలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ఆకాంక్షతో గ్రామంలోని విద్యాభిమానులు మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నపత్రాలు, అధ్యయన సామగ్రి సిద్ధం చేసేందుకు ప్రింటర్ అవసరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తికి స్పందించి పలువురు దాతలు రూ.15 వేల విరాళాలను అందజేశారు. ఈ మొత్తాన్ని గురువారం మండల విద్యాశాఖాధికారి-2 చిట్టిబాబు సమక్షంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.
మకరాంపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెయ్యిల హరికృష్ణ, ఉపాధ్యాయుడు దుద్ది బాలరాజు విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రింటర్ అవసరాన్ని గ్రామ పెద్దలు, దాతల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన గొనప కృష్ణారావు రూ.5,000, వజ్జ నవీన్ సాగర్ రూ.5,000, తమరాల శివాజీ రూ.2,000, బిరకట సురేష్ రూ.2,000, తమరాల గోవిందరావు రూ.1,000 అందించి మొత్తం రూ.15 వేల నిధిని సమకూర్చారు.
ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం సమాజం ముందుకు రావడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్థులు, దాతలు అందిస్తున్న సహకారం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా మెరుగైన ఫలితాలకు దోహదపడుతుందని చెప్పారు. విద్య కోసం చేసే ప్రతి విరాళం సమాజ భవిష్యత్తుపై పెట్టుబడితో సమానమని పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయులు నెయ్యిల హరికృష్ణ మాట్లాడుతూ, ప్రింటర్ అందుబాటులోకి రావడంతో పోటీ పరీక్షలకు అవసరమైన నమూనా ప్రశ్నపత్రాలు, వర్క్‌షీట్లు, అధ్యయన సామగ్రిని సకాలంలో సిద్ధం చేసి విద్యార్థులకు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా పోటీ ప్రపంచంలో ధైర్యంగా నిలబడేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
కాగా, పాఠశాల అభివృద్ధికి తొలి అడుగు నుంచి అండగా నిలుస్తూ వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న మాజీ సర్పంచ్ వజ్జ మృత్యుంజయ రావు, తమరాల శోభన్ బాబు సేవలను ఈ సందర్భంగా పాఠశాల కుటుంబం ప్రత్యేకంగా కొనియాడింది. విద్యా వికాసం కోసం వారు అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని పేర్కొంది.
దాతలు అందించిన ఈ సహకారం విద్యార్థుల విద్యాభ్యాసానికి కొత్త ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సహకారం కొనసాగాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆకాంక్షించారు.
