సాలినపుట్టుగలో స్వంత నిధులతో బోరుబావి ఏర్పాటు
పాఠశాల విద్యార్థులతో పాటు 15 కుటుంబాలకు తాగునీటి సౌకర్యం
బోరు కూలిపోయినా వెనుకడుగు వేయని వజ్జ మృత్యుంజయరావు
కంచిలి ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో నిబద్ధత ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో కంచిలి మండలం మకరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సాలినపుట్టుగ గ్రామంలో మరోసారి రుజువైంది. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను గుర్తించి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు తన స్వంత నిధులతో బోరుబావిని ఏర్పాటు చేసి విద్యార్థులు, గ్రామస్తుల దాహార్తిని తీర్చారు.
సాలినపుట్టుగ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పాఠశాల ఉపాధ్యాయులు మృత్యుంజయరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన పాఠశాల ఆవరణలోనే బోరుబావి తవ్వకానికి శ్రీకారం చుట్టించారు. అయితే తవ్వకం సమయంలో బోరు కూలిపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. అయినప్పటికీ సమస్య పరిష్కారం విషయంలో వెనక్కి తగ్గకుండా, విద్యార్థులకు తాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు.

పాఠశాల సమీపంలోని ప్రైవేటు స్థలంలో సుమారు రూ.2 లక్షల స్వంత నిధులతో కొత్త బోరుబావిని తవ్వించి, విద్యుత్ మోటారు ఏర్పాటు చేయించారు. అనంతరం పైప్లైన్ ద్వారా పాఠశాలకు నేరుగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టారు. గురువారం బోరుబావిని ప్రారంభించి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ బోరుబావి ద్వారా పాఠశాల అవసరాలు తీర్చడంతో పాటు గ్రామంలోని సుమారు 10 నుంచి 15 కుటుంబాలకు కూడా తాగునీటి సౌకర్యం కల్పించారు. వేసవి కాలంలో మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఊరటగా మారింది. ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న నీటి సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా స్వంత నిధులతో ముందుకొచ్చి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పేర్కొన్నారు. బోరు కూలిపోయినా నిరాశ చెందకుండా ఇచ్చిన మాటను నిలబెట్టి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించిన వజ్జ మృత్యుంజయరావును వారు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాలిన బాస్కర రావు,సాలిన బాలాస్వామి, సాలిన జగ్గారావు,సాలిన అబ్బాయి,సాలిన లక్ష్మణ మూర్తి,సాలిన రామారావు,నర్తు గురుమూర్తి,సాలిన జానకి రావు,కొర్రాయి వెంకట రమణ,సాలిన శివ కుమార్,తాళిన శివకుమార్,సాలిన వేణు గోపాల్ (చంటి)తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
