Homeఆంధ్రప్రదేశ్అడుగుకో గుంత.. గజానికో గొయ్యి. కిలోమీటరు కన్నీటి గాథ.

అడుగుకో గుంత.. గజానికో గొయ్యి. కిలోమీటరు కన్నీటి గాథ.

KANCHILI:అడుగుకో గుంత.. గజానికో గొయ్యి. కిలోమీటరు కన్నీటి గాథ.

గుంత’ల గోస

బాసు బంజిరి వాసుల నరకయాతన.

అడుగుకో గుంత.. గజానికో గొయ్యి. కిలోమీటరు కన్నీటి గాథ.

గర్భిణులకు మార్గమధ్యలోనే ప్రసవాలు – ప్రాణాలు గాల్లో కలిసే దుస్థితి.

వర్షాకాలమొస్తే నడవడమే సాహసం – కూటమి సర్కారు ఆదుకోవాలని వేడుకోలు.

KANCHILI: సాధారణంగా రోడ్డంటే గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మరీ అధ్వానంగా ఉంటే అడుగుకో గుంత, గజానికో గొయ్యితో దర్శనమిస్తాయి. కానీ కంచిలి మండలం బాసు బంజిరి గ్రామానికి వెళ్లే దారి చూస్తే స్థానికులు హడలెత్తిపోతున్నారు. వాహనంపై వెళ్తే రోడ్డు దాటే వరకు ఒళ్లు హూనం అయ్యే పరిస్థితి. కాలినడకన వెళ్దాం అంటే రాళ్లు రప్పలు బెంబేలెత్తిస్తున్నాయి.

ప్రాణాలతో చెలగాటం:

గ్రామానికి వెళ్లే సుమారు కిలోమీటరు మార్గం పూర్తిగా మట్టి రోడ్డుగా మారి, రాళ్లు తేలుతూ నిత్య నరకాన్ని తలపిస్తోంది. భారీ గుంతలు ఏర్పడడంతో రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అత్యవసర సమయాల్లో గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్దామంటే మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చే దుస్థితి.  క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్న ఘటనలు స్థానికులను కలిచివేస్తున్నాయి.  రాత్రి వేళల్లో ఈ దారి వెంట ప్రయాణం అంటే నరకప్రాయమని వాహనదారులు వాపోతున్నారు.

వర్షాకాలం వస్తే :

వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. రోడ్డంతా బురదమయంగా మారి, పక్కనే చెరువు ఉండడంతో ప్రయాణికులకు నడవడమే కష్టంగా మారింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, స్థానికులు నిత్యం సాహసం చేస్తూ ఈ కిలోమీటరు మేర రోడ్డును దాటుతున్నారు. రోగులు, వృద్ధుల బాధలు వర్ణనాతీతం.

ఏళ్లుగా కన్నీళ్లే :

ఈ సమస్యపై స్థానిక నేతలు, సంబంధిత అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా బాసు బంజిరి గ్రామానికి మోక్షం లభించడం లేదని వాపోతున్నారు.  ప్రజా ప్రతినిధులు హామీలకే పరిమితమవుతున్నారని, ఎన్నికలప్పుడు మాత్రమే ఊరు గుర్తుకొస్తుందని మండిపడుతున్నారు.

రోడ్డెక్కిన గ్రామస్థులు:

సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయిన గ్రామస్థులు తాజాగా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను మరమ్మతులు చేస్తున్న కూటమి ప్రభుత్వం తమ ఊరి రహదారిని కూడా బాగు చేయాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన రహదారి పనులు చేపట్టి తమ గోస తీర్చాలని కన్నీటితో కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular