PALASA : ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిరసిస్తూ ఆల్ ఇండియా బంద్ లో భాగంగా అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం నాడు పలాస కాశీబుగ్గ జంటపట్టణలకు చెందిన మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. సుమారు 56 మందుల దుకాణాల యజమానులు బంద్‌లో పాల్గొని ఈ-ఫార్మసీల విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో అత్యవసర హోమ్ డెలివరీల కోసం ఈ-ఫార్మసీలకు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కెమిస్టులు డిమాండ్ చేశారు. భారీ డిస్కౌంట్ల పేరుతో కార్పొరేట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయిస్తూ రిటైల్ మెడికల్ షాపుల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆరోపించారు.
ఆన్లైన్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మందులు విక్రయించడం వల్ల నకిలీ మందులు, యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే ఔషధాల దుర్వినియోగం పెరిగే ప్రమాదం ఉందని కెమిస్టులు హెచ్చరించారు. మందులను నిత్యావసర వస్తువుల మాదిరిగా విక్రయించడం ప్రజారోగ్య భద్రతకు ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలాస కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డోకి సురేష్, సెక్రటరీ బెల్లాల మురళి , ట్రెజరర్ నరేష్ తదితరులు పాల్గొనగా,బైక్ ర్యాలీ నిర్వహించి వినతిపత్రాన్ని పలాస ఎమ్మార్వో కు అందజేశారు.
