వడగాల్పులు పట్ల అప్రమత్తంగా ఉండాలి.
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ఉపాధి పనులు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.
రాబోయే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలి – ఇన్ చార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్.
శ్రీకాకుళం: వడగాల్పులు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇన్ చార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ బుధవారం కోరారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులుతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం విడుదల ప్రకటన మేరకు 21వ తేదీన గురువారం జిల్లాలో 5 మండలాల్లో (బూర్జ, హిరమండలం, ఎల్ ఎన్ పేట, పాతపట్నం, సారవకోట) తీవ్ర వడగాలులు , 5 మండలాల్లో (ఆముదాలవలస, జి. సిగడాం, జలుమూరు, కొత్తూరు, సరుబుజ్జిలి) వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు.
22వ తేదీన 2 మండలాల్లో (హిరమండలం, పాతపట్నం) వడగాలులు ఉంటాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మున్సిపాలిటీలు, పశుసంవర్థక శాఖ, అంగన్వాడీ కేంద్రాలు, తదితర అధికారులు అప్రమత్తతతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల వారి సొంత ఏర్పాట్లతో పాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ అవసరమున్నచోట తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
పశుసంవర్థక శాఖ జెడి మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ శాఖ సహకారం తో తొట్టెల్లో నీరు ఉండేట్లు చూస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ ఆర్టీసీ బస్ స్టేషన్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి పనులు వద్ద తాగునీరు అందుబాటుతో పాటు నీడ ఏర్పాటు చేయాలన్నారు. డ్వామా పిడి లవరాజు మాట్లాడుతూ నరేగ ఉపాధి వేతన దారులు ఉదయం 5.30 గంటల నుండి 9.30 గంటల వరకు, సాయంత్రము ఎండ తీవ్రత తగ్గిన తదుపరి పనులు నిర్వహించాలని సిబ్బంది కి ఆదేశించారు.
ఉపాధి పనులు జరిగే ప్రదేశంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ నేరుగా ఎండలో పనిచేస్తున్న వారు ఉదయం 11 గంటల నుండి 4.30 గంటల మద్యలో బహిరంగ ప్రదేశాల్లో పనులు నిలుపుదల చేస్తున్నట్లు పర్యవేక్షిస్తున్నామని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉండేట్లు ఆదేశాలు ఇస్తున్నట్లు వివరించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో వివిధ శాఖల జిల్లా స్థాయి , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
