కంచిలి : మండలంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతి వివరాన్ని ఖచ్చితత్వంతో నమోదు చేయాలని తహశీల్దార్ ఎన్.రమేష్‌కుమార్, ఎంపీడీవో వి.తిరుమలరావు స్పష్టం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జనగణన సూపర్వైజర్లు, సిబ్బందికి పలు దిశానిర్దేశాలు చేశారు.
జనగణన అనేది ప్రభుత్వ పాలనకు ప్రాథమిక ఆధారమని, ప్రజల సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించే కీలక ప్రక్రియ అని అధికారులు పేర్కొన్నారు. గ్రామాలు, వార్డుల వారీగా ప్రతి కుటుంబ వివరాలను నిష్పక్షపాతంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు.
జనగణన ద్వారా సేకరించే సమాచారమే భవిష్యత్ సంక్షేమ పథకాల రూపకల్పన, నిధుల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రామాణికంగా నిలుస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత పర్యవేక్షణ పెంచి, పెండింగ్ వివరాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ జనగణన ప్రాధాన్యతను వివరించాలని, సమాచార సేకరణలో బాధ్యతాయుత ధోరణి పాటించాలని సూచించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ సంతోష్‌కుమార్, ఎంఈఓ శివరాం ప్రసాద్, జనగణన సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
