Homeఆంధ్రప్రదేశ్ఈ-ఫార్మసీల దూకుడుపై కెమిస్టుల గళమెత్తింపు.

ఈ-ఫార్మసీల దూకుడుపై కెమిస్టుల గళమెత్తింపు.

SOMPETA : ఈ-ఫార్మసీల దూకుడుపై కెమిస్టుల గళమెత్తింపు.

సోంపేటలో స్వచ్ఛందంగా మూతపడ్డ 150 మెడికల్ షాపులు.

ఆన్‌లైన్ మందుల విక్రయాలు ప్రజారోగ్యానికి ముప్పు.

కెమిస్టుల ఆందోళనకు వైద్యుల సంఘీభావం.

ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలను నిరసిస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం సోంపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.  టౌన్,  రూరల్ పరిధిలోని సుమారు 150 మందుల దుకాణాల యజమానులు బంద్‌లో పాల్గొని ఈ-ఫార్మసీల విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో అత్యవసర హోమ్ డెలివరీల కోసం ఈ-ఫార్మసీలకు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కెమిస్టులు డిమాండ్ చేశారు.  భారీ డిస్కౌంట్ల పేరుతో కార్పొరేట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయిస్తూ చిన్న రిటైల్ మెడికల్ షాపుల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆరోపించారు.

ఆన్‌లైన్‌లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ల సరైన ధృవీకరణ లేకుండా మందులు విక్రయించడం వల్ల నకిలీ మందులు, యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే ఔషధాల దుర్వినియోగం పెరిగే ప్రమాదం ఉందని కెమిస్టులు పేర్కొన్నారు. మందులను నిత్యావసర వస్తువుల మాదిరిగా విక్రయించడం ప్రజారోగ్య భద్రతకు ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు, జనఔషధి కేంద్రాలు, ప్రధాన చైన్ ఫార్మసీలు సేవలు కొనసాగించాయి.

ఈ ఆందోళనకు సంఘీభావంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పైడిశెట్టి రమేష్ కుమార్, డాక్టర్ జోగు నాయుడు, డాక్టర్ మంచు ప్రదీప్ కుమార్, డాక్టర్ దుర్యోధన, డాక్టర్ వెంకటేష్ పాల్గొని కెమిస్టులకు మద్దతు తెలిపారు.  ప్రజారోగ్య పరిరక్షణలో నియంత్రణలేని ఆన్‌లైన్ మందుల విక్రయాలు ప్రమాదకరమని వారు అభిప్రాయపడ్డారు.
ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాల ప్రభావంతో దేశవ్యాప్తంగా లక్షలాది కెమిస్టుల ఉపాధి దెబ్బతింటోందని,  ప్రత్యక్షంగా,  పరోక్షంగా కోట్లాది కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సోంపేట కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వజ్జ కృష్ణారావు, సెక్రటరీ సురేష్, ట్రెజరర్ సాన శ్రీనివాసరావు, జిల్లా ఈసీ సభ్యులు పాలిసెట్టి రవి,  సాన మురళి,  ప్రభాకర్ రావు,  శ్రీనివాసరావు,  రామరాజు,  గోపాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular