రేషన్ పంపిణీలో పారదర్శకత పాటించాలి – డీలర్లకు తహశీల్దార్ రమేష్ కుమార్ ఆదేశం.
కంచిలి : ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా రేషన్ సరుకుల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని కంచిలి మండల తహశీల్దార్ ఎన్. రమేష్ కుమార్ రేషన్ డీలర్లకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సరుకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందేలా డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. రేషన్ పంపిణీ ప్రక్రియలో నిర్లక్ష్యం, అక్రమాలు, ఫిర్యాదులకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ-పాస్ యంత్రాల వినియోగం, బయోమెట్రిక్ సమస్యలు, సరుకుల నిల్వలు, పంపిణీ విధానం తదితర అంశాలపై డీలర్లతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. బయోమెట్రిక్ లోపాలు లేదా సాంకేతిక సమస్యల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల పంపిణీ వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తహశీల్దార్ తెలిపారు.
రేషన్ దుకాణాల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో పలువురు డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తహశీల్దార్ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని రేషన్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
