Palasa : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ, సూదికొండ ప్రాంతానికి చెందిన చింతాడా దేవి అనే దళిత మహిళ కు చెందిన నిర్మాణం జరుగుతున్న ఇంటిని బుల్డోజర్ తో తొలగించిన నేపధ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన వార్తకు స్పందించిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో నేడు పలాస లో ఎమ్మార్పీఎస్ ఎం యెస్ శ్రీకాకుళం జిల్లా ఇన్ ఛార్జ్ తొత్తరమూడి శ్రీనివాస్ మాదిగ మీడియా సమావేశంలో మాట్లాడారు.
శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, పలాస నియోజకవర్గంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తమ నాయకుడు మందకృష్ణ మాదిగ తోడ్పాటునిచ్చారని, ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో తెలియజేశారని గుర్తుచేశారు. కూటమి గెలుపులో దళితుల పాత్ర ఉందని అటువంటి దళితులకు అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తారా అని స్థానిక కూటమి నాయకులకు సూటిగా ప్రశ్నించారు.
పలాస లో దళిత మహిళ దేవి నిర్మించుకుంటున్న ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన గతంలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర్ శివాజీ హయాంలో బాదితురాలికి ఇచ్చిన స్థలమేనని శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు.
తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష జోక్యం చేసుకుని కూల్చివేతకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని శ్రీనివాస్ మాదిగ కోరారు. కార్యక్రమంలో కే.ఎన్.పి.యెస్ నాయకుడు ఎం కృష్ణ, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు యెస్ రమణ మాదిగ పాల్గొన్నారు.
