పలాస: పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించగా, సభ్యులందరి ఏకగ్రీవ మద్దతుతో సీనియర్ జర్నలిస్టు సి.హెచ్. నేతాజీ మూడోసారి అధ్యక్షుడిగాను, రెండవసారి సంపతిరావు జయంత్ కుమార్ సెక్రటరీగాను,మొదటిసారి రత్నాల రమేష్ ట్రెజరర్గాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సి.హెచ్. నేతాజీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు. పలాస ప్రాంతంలోని విలేకరుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.
జర్నలిస్టులకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, హెల్త్ కార్డులు, బీమా సదుపాయాలు, అక్రిడిటేషన్ సమస్యలు, నివాస స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ప్రత్యేకంగా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అలాగే యువ జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
సెక్రటరీగా ఎన్నికైన సంపతిరావు జయంత్ కుమార్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించి, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున ముందుండి పనిచేస్తానని అన్నారు.
ట్రెజరర్‌గా ఎన్నికైన రత్నాల రమేష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తూ, సభ్యుల సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సంఘానికి అవసరమైన వనరుల సమీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల సందర్భంగా పలాస జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా అభినందించారు. సి.హెచ్. నేతాజీ నాయకత్వంలో ప్రెస్ క్లబ్ మరింత అభివృద్ధి చెందుతుందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, సెక్రటరీ, ట్రెజరర్లను సభ్యులు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
