మహిళల హక్కులు కాపాడాలంటూ పలాస ఆర్డీఓ ఆఫీస్ ఎదుట పిఓడబ్ల్యూ సభ్యుల నిరసన.
PALASA: దేశంలో మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించేందుకు గాను ఓబీసీ,మైనారిటీ మహిళలకు సబ్ కోటాలతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని,చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలంటూ సోమవారం నాడు ప్రగతిశీల మహిళా సంఘ నాయకులు,సభ్యులు పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రగతిశీల మహిళా సంఘం 9వ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా పలాస ఆర్డీఓ కు మహిళా హక్కులపై వినతిపత్రాన్ని అందజేసినట్లు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కుసుమ తెలిపారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామీణ ప్రజల జీవనాధారంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను పాలక ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలన్నారు.ఉపాధిహామీ చట్టాలను యధావిధిగా కొనసాగించాలన్నారు.
మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూపించే విధానాలను,ప్రకటనలు,ప్రోత్సాహకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ముగ్గుర్ని కంటే ఇంతిస్తాం,నలుగుర్ని కంటే అంతిస్తాం అనే ప్రోత్సాహకాల ప్రకటనలు మహిళల స్వేచ్ఛను,ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంటనే ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలంటూ కుసుమ ఈసందర్భంగా హెచ్చరించారు.

