విద్యుత్ లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి వినతి
కంచిలి: మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో వినతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు నాయకత్వంలో ప్రతినిధులు పాల్గొని గ్రామాల విద్యుత్ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సిజిఆర్ఎఫ్) చైర్మన్ సత్యనారాయణ మరియు కమిటీ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్.పల్లి సబ్‌స్టేషన్‌లో అవసరమైన సాంకేతిక మార్పులు చేసి పవర్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని మెరుగుపరచాలని, తద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు సమానంగా, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
తక్కువ వోల్టేజ్ సమస్యల కారణంగా గృహ వినియోగదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వ్యవసాయ మోటార్ల వినియోగం, విద్యుత్ ఆధారిత పనులు ప్రభావితమవుతున్నాయని వినతిలో పేర్కొన్నారు.
సాంకేతిక లోపాలను సరిచేసి విద్యుత్ సరఫరాను స్థిరీకరించాలని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సిజిఆర్ఎఫ్ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ లో వోల్టేజ్ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీపీ మండల అధ్యక్షులు వాసాల రమేష్ రెడ్డి, సూర్యనారాయణ, టీడీపీ నాయకులు ప్రకాశ్, రామారావు, మన్మధరావు, జనసేన మండల అధ్యక్షుడు డొక్కరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
