విద్యార్థి దశ నుంచే మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
KAVITI : కవిటి విద్యార్థి దశ నుంచే దేశ మహనీయుల జీవితాలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శ పౌరులుగా ఎదగాలని శ్రీ కళ్యాణి ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి, ఏవో రాణి సూచించారు. కవిటి పట్టణంలోని శ్రీ కళ్యాణి ఆంగ్ల పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం అల్లూరి సీతారామరాజు జయంతి, స్వామి వివేకానంద, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి అనేక పోరాటాలు చేసి కీలక పాత్ర పోషించారని వివరించారు. ప్రపంచ వేదికపై చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగంతో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు.
నేడు దేశమంతా గర్వంగా ఎగరవేస్తున్న జాతీయ జెండాను రూపకల్పన చేసిన మహనీయుడు పింగళి వెంకయ్య సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. మహనీయుల ఆశయాలు, సిద్ధాంతాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకుంటే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన, ఆదర్శ పౌరులుగా ఎదగగలరని వారు తెలిపారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
