రాజాంలో విషాదం – పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలం గెడ్డవలస గ్రామంలో మంగళవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పాటు పిడుగుపడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పొలంలో దొండకాయలు ఏరుతున్న సమయంలో గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. అదే సమయంలో పిడుగు పడటంతో పైల రాము, మజ్జి అప్పల నరసమ్మ, మజ్జి సత్తమ్మ మృతి చెందారు.
ఒకే ఇంటికి చెందిన తోడి కోడళ్ళు మృతి చెందడం గ్రామాన్ని కలిచివేసింది. ఈ ఘటనతో గెడ్డవలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
