జీడి ఉత్పత్తి పెంపు – విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటే ప్రధాన లక్ష్యం అనిఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు
పలాస నియోజకవర్గంలో జీడి ఉత్పత్తిని మూడు రెట్లు పెంచడంతో పాటు, జీడి ఆధారిత విలువ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక చర్యలపై ఈరోజు పలాస శాసనసభ్యుల కార్యాలయంలో ఎస్సార్ కంపెనీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష , టెక్కలి హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్ , పలాస కాజు మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు , జీడి పరిశ్రమల యజమానులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీదారులు, ఎస్సార్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని పలాస ప్రాంతంలో జీడి సాగు విస్తరణ, దిగుబడి పెంపు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
చర్చ సందర్భంగా జీడి ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో విజయవంతమైన మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతం, కేరళ రాష్ట్రంలోని జీడి సాగు మరియు పరిశ్రమల నమూనాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక పరిశ్రమవేత్త, ఒక రైతు, ఒక పారిశ్రామికవేత్తతో కూడిన బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, అక్కడి అనుభవాలను పలాసలో అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష మాట్లాడుతూ, “ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించాలి. అయితే పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ పారిశ్రామికాభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు” అని అన్నారు.
పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తే మరిన్ని పరిశ్రమలు పలాసకు వస్తాయని, అందుకు ప్రజలందరి సహకారం అవసరమని అన్నారు.
ESSAR కంపెనీ జీడితో పాటు జీడి తొక్కను ఉపయోగించి బై-ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రణాళిక అమలైతే పలాసలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, పలాస పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలాస తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త శ్రీ వెంకన్న చౌదరి , ఎస్సార్ కంపెనీ ప్రతినిధులు సాయిక్ అప్పారావు , హృషికేశ్ పరంజిత్ , అరుణ్ రంజన్ , ఏఎంసీ చైర్మన్ , పలాస కాజు పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
