మంత్రి అచ్చెన్నాయుడు కృషితో ఎచ్చెర్లకు జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల మంజూరు.
37 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం.
ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వెనుకబడిన తరగతుల బాలికలకు నాణ్యమైన గురుకుల విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన నిరంతర కృషి ఫలించింది. మంత్రి ప్రత్యేక చొరవతో ఎచ్చెర్లకు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల బాలికలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో గురుకుల విద్యాసంస్థ అవసరాన్ని సమగ్రంగా వివరించి ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
నూతనంగా మంజూరైన ఈ గురుకుల బాలికల పాఠశాల నిర్వహణ కోసం వివిధ విభాగాల్లో మొత్తం 37 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థినులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతి, శిక్షణా సౌకర్యాలు అందనున్నాయి.
ఎచ్చెర్లకు గురుకుల పాఠశాల మంజూరు కావడం నియోజకవర్గ విద్యా రంగ అభివృద్ధిలో ఒక మైలురాయిగా స్థానిక ప్రజలు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా బీసీ బాలికలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే అవకాశం కల్పించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషిని ప్రజలు, బీసీ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కూడా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కృషిని కొనియాడుతూ, ఎచ్చెర్ల విద్యాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది పేద విద్యార్థినులు గురుకుల విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకునే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
