Kaviti స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి..
గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి: పిరియా సాయిరాజ్
కవిటి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజపురం గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
అంతకుముందు ఇటీవల మృతిచెందిన స్ధానిక మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సాయిరాజ్, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు, సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రజలకు చేరువై వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మండలంలోని అన్ని పంచాయతీల్లో పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ఇప్పటి నుంచే సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలం కార్యకర్తలేనని, వారి అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వమే విజయాలకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్టీ చేపడుతున్న పోరాటాలకు కార్యకర్తలు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఇటీవల నిర్వహించిన నిరసన దీక్షను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కడియాల ప్రకాష్‌తో పాటు పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
