PALASA : కనుమరుగౌతున్న పౌరాణిక నాటకాలకు జీవం పోస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు
ఆయనో ఉపాధ్యాయుడు,వృత్తి విద్యాబోధన అయినప్పటికీ,ఆయనొక కళాకారుడు.ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడైనప్పటికీ,తెలుగు సాహిత్యం పై ఆసక్తితో పౌరాణిక నాటకాలవైపు ఆకర్షితుడై,పౌరాణిక పద్యాలను అభ్యసించి అలవోకగా పాడగలడు.ఎంతో మంది గురువుల వద్దపౌరాణిక నాటకాలలో శిక్షణ పొంది రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు,ఒడిశా రాష్ట్రాలలో వందలకొలది పౌరాణిక నాటకాల ప్రదర్శనలలో పాల్గొని రాష్ట్ర,జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకుని మంచి గుర్తింపు పొందారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు కణితి.సూర్యనారాయణ మాస్టారు సత్యహరిశ్చంద్ర,గయోపాఖ్యానం,శ్రీరామాంజనేయ యుద్ధం,లవకుశ వంటి పౌరాణిక నాటకాలలో స్త్రీ పాత్రలతోపాటు, ఎన్నో విభిన్న పాత్రలను పోషించి నేటికీ అనేక చోట్ల ప్రదర్శనలిస్తూ వారెవ్వా! అనిపించుకుంటున్నారు.ఇదే నేపథ్యంలో ఈఏడాది జూన్ నెలలో రాజమండ్రి లో నిర్వహించబడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు చైతన్య సారస్వత పరిషత్ నుండి సూర్యనారాయణ మాస్తారుకు ఆహ్వానం అందిందన్న విషయం తెలుసుకున్న తేజస్ టివి తెలుగు న్యూస్ ఛానల్ ఆయనను కలిసింది.
