- ఇచ్చాపురం పోలీసుల తనిఖీల్లో 30 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం.
రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్ – వాహనం, మొబైల్ ఫోన్లు సీజ్.
శ్రీకాకుళం, మే 28: జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఇచ్చాపురం పట్టణ మరియు రూరల్ పోలీసులు గురువారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి మొత్తం 30.680 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. చిన్నం నాయుడు కేసు వివరాలు వెల్లడించారు.
ఇచ్చాపురం పట్టణ పోలీసు స్టేషన్ కేసు వివరాలు: తే. 28.05.2026 సాయంత్రం 4.00 గంటల సమయంలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఇచ్చాపురం పట్టణ పోలీసు ఎస్.ఐ ఎం. ముకుందరావు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న రాహుల్ విష్ణు ఇంగ్లే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద నుండి 22.250 కేజీల గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు మహారాష్ట్ర రాష్ట్రం జల్నా ప్రాంతానికి చెందినవాడని, ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి వ్యాపారులతో సంబంధాలు పెట్టుకొని బరంపురం – ఇచ్చాపురం మార్గంలో గంజాయిని తరలిస్తూ మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు వెల్లడించాడు. రైల్వే మార్గం ద్వారా గంజాయిని తరలించే క్రమంలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.
ఇచ్చాపురం రూరల్ పోలీసు స్టేషన్ కేసు వివరాలు: తే. 28.05.2026 మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో ఇచ్చాపురం మండలం ఎం. తోటూరు జంక్షన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఇచ్చాపురం రూరల్ పోలీసు ఎస్.ఐ ఆర్. జనార్థనరావు, లికు బెహరా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద నుండి 8.430 కేజీల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ మరియు హోండా యాక్టివా స్కూటీ (OD 07 AC 6548) స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు తన అన్నయ్య గౌర బెహరాతో కలిసి ఒడిశా రాష్ట్రం ఖందమాల్ ప్రాంతం నుండి గంజాయిని తీసుకొచ్చి, రైల్వే మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు వెల్లడించాడు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు గంజాయిని తరలించే క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది.
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీసు శాఖ, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాలు మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా గంజాయి అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు.
