ఇచ్చాపురం గెలుపే లక్ష్యం గా పనిచేయాలి.
ఇచ్చాపురం వైసిపి నాయకులకు జగన్ దిశానిర్దేశం.
జగన్మోహన్ రెడ్డిని కలిసిన సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి, నరేంద్ర యాదవ్.
ఇచ్చాపురం నియోజకవర్గంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారనీ, ఇచ్చాపురంలో పార్టీ గెలుపునకు అందరూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు పార్టీ ఇంచార్జ్ సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసంలో ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ సాలిన గాంధీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, గ్రామ స్థాయి బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించినట్లు శ్యాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. పార్టీ కమిటీల ఏర్పాటు, గ్రామ స్థాయి నాయకత్వ విస్తరణ, ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రత్యేక సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒడియా మాట్లాడే వర్గాలకు పార్టీ కమిటీల్లో మరింత ప్రాధాన్యం కల్పించాలని సూచించారని, మత్స్యకార వర్గాలకు బలమైన నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారన్నారు. అలాగే పార్టీ చేపడుతున్న ఇంటింటి సంప్రదింపుల కార్యక్రమాలు, బూత్ స్థాయి ప్రతినిధుల శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టంగా నిర్మించాలని సూచించడం జరిగిందన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పోరాటాన్ని బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి నాయకత్వంపై జగన్ ప్రత్యేకంగా స్పందించినట్లు తెలిసింది. “ఇచ్చాపురం నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలుచుకోవాలి. ఇతర పార్టీల్లో సరైన ప్రాధాన్యం లభించని రెడ్డిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చింది. శ్యాంప్రసాద్ రెడ్డి నా మనిషి” అంటూ ఆయనపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు సమాచారం. యువ నాయకుడిగా కష్టపడి పనిచేసే తత్వానికి, నర్తు నరేంద్ర యాదవ్ అనుభవం తోడైతే అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుని విజయ దిశగా ముందుకు సాగవచ్చని ఉత్సాహపరిచారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులను సానుకూలంగా మలుచుకుని పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ సూచించినట్లు సమాచారం. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఇచ్చాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు స్పష్టం చేశారు.
