PMJ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కరుడుకట్టిన అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్ట్.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న PMJ జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. ఈ దోపిడీలో 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు కలిపి మొత్తం రూ.82,02,000/- విలువైన ఆభరణాలు దోచుకెళ్లబడింది. ఈ ఘటనలో నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌ను ప్రస్తుతం బీహార్ జైలులో ఉన్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్ మరియు “ది గోల్డెన్ థీఫ్” గా పేరొందిన సుభోద్ సింగ్ ప్రణాళికా బద్ధంగా నిర్వహించాడు.
ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ (@ జగీరా సింగ్) ను 13-05-2026న సాయంత్రం 4:00 గంటల సమయంలో వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు రవీష్ కుమార్ (@ ప్రద్యుమన్) మరియు మెహతాబ్ ఖాన్‌లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువచ్చారు. రఘునాథ్ కర్మాకర్ విచారణలో బీహార్ మరియు బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా గురించి కీలక సమాచారం బయటపడింది. ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు మరియు బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
“ది గోల్డెన్ థీఫ్” గా పేరొందిన సుభోద్ సింగ్ నాయకత్వంలో ఈ గ్యాంగ్ ఏర్పడినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ముందస్తుగా రేక్కీ నిర్వహించడం, నేరము చేసిన తరువాత తప్పించుకునే మార్గాలను గుర్తించడం, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు ఉపయోగించడం, తప్పుడు పేర్లతో లాడ్జ్‌లలో ఉండడం, ఆధునిక సాంకేతికత వినియోగించడం వంటి పద్ధతులతో ఆయుధాలతో దోపిడీలు నిర్వహించేది. సుభోద్ సింగ్ మరియు అతని అనుచరుల ప్రణాళిక ప్రకారం కింది నిందితులు తెలంగాణకు రెండు నెలల క్రితం వచ్చారు:
రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్, రవీష్ కుమార్ @ ప్రద్యుమన్, రాధే @ అభయ్, ప్రమోద్ గోస్వామి @ మిశ్రా, సూర్యమణి కుమార్ @ సనోజ్. తెలంగాణలోకి ప్రవేశించే ముందు వీరు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ.10,000 చొప్పున కొనుగోలు చేశారు. అనంతరం వీరు ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకుల పై రేక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌ను లక్ష్యంగా ఎంచుకుని పెద్దపల్లిలోని ఒక లాడ్జ్ లో బస చేశారు. 01-05-2026 రోజున ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్‌కు మారి దోపిడీకి సిద్ధమయ్యారు.
సుభోద్ సింగ్ అనుచరుల సమాచారంతో రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి రైలులో చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు 02-05-2026 న గడ్చందూర్ పరిసరాల్లో ఆరు పిస్టల్స్ మరియు మ్యాగజైన్లు అందజేశారు. అనంతరం రఘునాథ్ కర్మాకర్ ఆయుధాలతో ధర్మపురికి తిరిగి వచ్చాడు. 03-05-2026న ఉదయం ఐదుగురు నిందితులు ధర్మపురిలో వారు ఉన్న లాడ్జ్ ఖాళీ చేసి రెండు బైక్‌ల పై బయలుదేరారు. బ్యాగులను కొండ ప్రాంతంలో దాచిపెట్టి, అక్కడే వారి బైక్ నంబర్ ప్లేట్లు మార్చి, వెలిచాల ఎక్స్ రోడ్ వద్దకి చేరుకొని అక్కడ టిఫిన్ చేసి, దోపిడీ ప్రణాళికను మరోసారి చర్చించారు. తరువాత ఉదయం 10:50 గంటలకు PMJ జ్యువెలరీ షాప్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం రాధే @ అభయ్ కస్టమర్లా, షాప్‌లోకి వెళ్లి పరిస్థితిని గమనించాడు. రాధే మెస్సేజ్ ఇచ్చిన తర్వాత మిగతా నిందితులు లోపలికి ప్రవేశించి సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారు. నగలు దోచుకొనుచుండగా స్టాఫ్ ప్రతిఘతించడముతో నిందితులు వారి వద్ద ఉన్న ఆయుదాలతో స్టాఫ్ పై కాల్పులు జరిపారు.
నిందితులు షాప్ నుండి పారిపోతూ,వారు షాపులో దోచుకున్న ఒక ఆభరణాల బ్యాగ్‌ను తీసుకుని పారిపోయారు. ఆందోళనలో మరో బ్యాగ్‌ను షాప్‌లోనే వదిలివేశారు. ముందుగా నిర్ణయించిన మార్గంలో ధర్మపురికి చేరుకున్నారు. సనోజ్, రాధే @ అభయ్, ప్రద్యుమన్ గోదావరి నది ఒడ్డున పల్సర్ బైక్‌ను వదిలి నడుచుకుంటూ నది దాటి మంచిర్యాల నుంచి రైలులో పరారయ్యారు. మరోవైపు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్ మరియు మిశ్రా ఆభరణాల బ్యాగ్‌తో అపాచీ బైక్‌పై గుండాల అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తెలుపు రంగు క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్ మరియు బైక్ అప్పగించి సమీప రైల్వే స్టేషన్ ద్వారా బీహార్‌కు పారిపోయారు.
సాంకేతిక నిఘా ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటివరకు 13 మంది నిందితులను గుర్తించాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు, రూ.51,000 ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. మిగిలిన నిందితులు మరియు దోచుకెళ్లిన ఆభరణాల కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకొన్న వస్తువులు : నగదు – రూ.51,000/-
మొబైల్ ఫోన్లు – 2, సిమ్ కార్డులు – 2, నకిలీ ఆధార్ కార్డు.
అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు:
1. రఘునాథ్ కర్మాకర్ @ జాగీర సింగ్ s/o లేట్ కాళిదాస్ కర్మాకర్, వయస్సు 41 సంవత్సరాలు, కులం: హిందూ లోహర్, వృత్తి: కార్ డ్రైవర్, నివాసం: మల్లిక్ పడ, సాల్వన్ గ్రామము, అసన్సోల్ సౌత్ మండల్, పాశివర్ధన్, వెస్ట్ బెంగాల్, (ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, ఆయుధ చట్టాల కింద 7 కేసులు ఉన్నాయి).
2. రావిష్ కుమార్ @ ప్రద్యుమన్ s/o శంకర్ ప్రసాద్, వయస్సు 23 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: కూలి, నివాసం: గవాల్ బిఘ గ్రామం, హిల్స మండలం, నలంద జిల్లా, భీహార్ రాష్ట్రం. (ఇతనిపై దొంగతనం, దోపిడీ, హత్య, ఆయుధ చట్టాల కింద 15 కేసులు ఉన్నాయి).
3. మెహతాబ్ ఖాన్ s/o మహబూబ్ ఖాన్, 32 సం. ముస్లిం, నివాసం. నూరుద్దీన్ రోడ్, అసన్సోల్ సౌత్ పి.యస్, పచ్చిమ్ బర్దన్, వెస్ట్ బెంగాల్. (నేరానికి ఉపయోగించిన సిమ్ కార్డులు సరఫరా చేసిన వ్యక్తి).
పరారీలో ఉన్న నిందితులు :
సుభోద్ సింగ్ (గ్యాంగ్ లీడర్), రాధే మిశ్రా @ అభయ్ @ ప్రమోద్ గోస్వామి మిశ్రా, సూర్యమణి కుమార్ @ సనోజ్.
పోలీసుల సూచనలు :
నాణ్యమైన CCTV కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలి. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించి అప్రమత్తంగా ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. లాడ్జ్‌లు, గెస్ట్ హౌస్‌లు సరైన ఐడీ ధృవీకరణ తర్వాత మాత్రమే గదులు ఇవ్వాలి. నగదు, బంగారం రవాణా సమయంలో భద్రతా నియమాలు పాటించాలి.
కరీంనగర్ పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, CCTV ఫుటేజ్, సాంకేతిక విశ్లేషణ మరియు అంతర్రాష్ట్ర సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోందని, మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
