Homeఆంధ్రప్రదేశ్గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు... యువతలో క్రీడాస్ఫూర్తి.

గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు… యువతలో క్రీడాస్ఫూర్తి.

క్రీడా పోటీలు నిర్వహించడం యువతలో క్రీడాస్ఫూర్తి,  ఐక్యత, ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తోంది.

గ్రామీణ క్రీడా ప్రతిభకు అద్దం పట్టిన పోలమ్మతల్లి క్రికెట్ టోర్నీ.

గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి,  వారికి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కవిటి మండలం ఆర్.బెలగాంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోలమ్మతల్లి క్రికెట్ టోర్నమెంట్ క్రీడాభిమానులను అలరించింది.   గత 25 రోజులుగా ఉత్సాహంగా సాగిన ఈ టోర్నీ శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగియగా,  ఎస్సార్సీపురం జట్టు అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది.

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సార్సీపురం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోరు సాధించింది.   ఓపెనర్ పీ. రవి కేవలం 25 బంతుల్లో 2 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 73 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మలిచాడు.   అతని దూకుడు బ్యాటింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.   పిట్ట మహేశ్ 12 బంతుల్లో 28 పరుగులు,   కృష్ణ 16 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించారు.

142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్.బెలగాం ఫైటర్స్ జట్టు ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది.  జలా 17 బంతుల్లో 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా,  కెప్టెన్ విన్ను 7 బంతుల్లో 18 పరుగులు జోడించినా ఫలితం లేకపోయింది.  నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 94 పరుగులకే పరిమితమై 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఎస్సార్సీపురం బౌలర్లలో కొండల్సి నాని 3 వికెట్లు, అశోక్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు కీలక క్యాచ్ అందుకున్న పీ. రవికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువత, క్రీడాభిమానులు తరలివచ్చారు.   ప్రతి బౌండరీకి,  ప్రతి వికెట్‌కు ప్రేక్షకుల కేరింతలతో మైదానం మార్మోగింది.   గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం యువతలో క్రీడాస్ఫూర్తి,  ఐక్యత, ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్,  టీడీపీ కవిటి మండల కార్యదర్శి తిప్పన మోహనరావు,  జడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ రంగా,  ఎంపీటీసీ ప్రతినిధి సంతోష్ పట్నాయక్, ఎక్స్ కోఆప్షన్ మెంబర్ బాసుదేవ్ రౌళో,  జీరు కేశవరావు,  మృత్యుంజయ పట్నాయక్,  నవోదయ యువజన సంఘం సభ్యులు,  క్రీడా కమిటీ సభ్యులు,  యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular