ప్రభుత్వ బడులపై నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం.
మకరాంపురం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుల కృషికి ప్రశంసలు.
గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం కాకుండా చూడాలనే బాధ్యతతో కంచిలి మండలం మకరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన చేరికల ప్రచారం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. మండల విద్యాశాఖ అధికారి సప్పటి శివరాం ప్రసాద్ సూచనల మేరకు ప్రధానోపాధ్యాయుడు చింతాడ అప్పలరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం మకరాంపురం పంచాయతీ పరిధిలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను వివరించారు.
ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, క్రీడా ప్రోత్సాహం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలను వివరించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్య అనేది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి పునాది కావాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడులపై అవగాహన పెంచేందుకు ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడడం, విద్యపై వారి నిబద్ధతకు నిదర్శనమని పలువురు కొనియాడారు.
ప్రతి విద్యార్థి చదువులో ముందుండాలని, ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని హెచ్.ఎం. అప్పలరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
