10వ తరగతి టాపర్ల ను అభినందించిన కాళ్ల జైదేవ్…
ఇచ్చాపురం మండలంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జైదేవ్ సోమవారం స్వయంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పుష్పగుచ్ఛం, స్వీట్లు అందజేసి వారి కృషిని ప్రశంసించారు. విద్యార్థులు తమ విజయానికి సంబంధించిన అనుభవాలను పంచుకోగా, కష్టపడి చదివితే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జైదేవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 590 మార్కులు సాధించిన నందిని మహారానీ, 588 మార్కులు సాధించిన సిందిరి దీక్ష , 589 మార్కులు సాధించిన గౌతు కౌసల్య లను కలిసి, అభినందించారు. ఈ సందర్భంగా జైదేవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఈ విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయుల కృషి మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఇలాగే ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ళ జైదేవ్ తో పాటు కొర్రాయి ధర్మరాజు, కాళ్ళ సిద్దు పాల్గొన్నారు.
