గ్రేవ్ కేసుల దర్యాప్తు వేగవంతం : జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.
కాశీబుగ్గ,టెక్కలి డీఎస్పీ కార్యాలయాలను వార్షికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్, కాశీబుగ్గ మరియు టెక్కలి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాలను వార్షికంగా తనిఖీ చేసి, పలు ముఖ్యమైన రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సిబ్బంది నుండి గౌరవ వందనం అందుకున్న జిల్లా ఎస్పీ ఆయా సబ్ డివిజన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, ఛార్జ్‌షీట్ల దాఖలు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా సమీక్షించారు. కేసుల ఫైళ్లను పరిశీలించి, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

రౌడీషీటర్లకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలని, నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలును వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో, మహిళలపై నేరాలలో బాధితులకు న్యాయం చేకూరేలా దర్యాప్తు పారదర్శకంగా చేసి నిందితులను త్వరితగతిన అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని, గంజాయి, ప్రాపర్టీ కేసుల దర్యాప్తును, వేగవంతంగా పూర్తి చేసి, పోక్సో కేసులలో నిర్ణీత గడువులో ఛార్జ్‌షీట్లు కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రాపర్టీ కేసులను చేధించి దొంగిలించబడిన ఆస్తులను రికవరీ చేయాలని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి, గస్తీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, అవసరమైన చోట డ్రోన్ సాయంతో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పేకాట, గంజాయి, డ్రంకెన్ డ్రైవ్ మరియు ఓపెన్ డ్రింకింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతా భావన పెంపొందించాలని, ప్రజా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, సంబంధిత చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ తనిఖీల సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని, టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు, సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
