సీదిరి అప్పలరాజుకు బెయిల్.. సోంపేట కోర్టులో ఊరట
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సోంపేట ఆరో అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో జూలై 22న పోలీసులు అప్పలరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయన అంపోలు జైలులో ఉన్నారు.
బెయిల్ కోసం అప్పలరాజు సోంపేట కోర్టును ఆశ్రయించగా.. గతంలో పిటిషన్‌పై విచారణలు, వాయిదాలు కొనసాగాయి. తాజాగా శుక్రవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆరో అదనపు జిల్లా కోర్టు.. అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. ఈ ఘటనలో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మపై కేసు నమోదైంది. అనంతరం కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అప్పలరాజును పోలీసులు నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు.
అప్పలరాజు అరెస్టు, రిమాండ్, బెయిల్ వ్యవహారం స్థానికంగా రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. అయితే కోర్టు విధించిన బెయిల్ షరతులు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
