వైకాపా మూర్ఖపు పాలనలో రోడ్లు ధ్వంసం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం: టిడిపి మండల అధ్యక్షుడు సూరాడ మోహన్ ధ్వజం.
వజ్రపుకొత్తూరు : గడిచిన ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ పాలన వల్ల రాష్ట్రంలో వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో వీధిన పడి చనిపోయే పరిస్థితి వచ్చిందని, ఇది ముమ్మాటికీ వైకాపా మూర్ఖపు పాలన లక్షణమేనని వజ్రపుకొత్తూరు మండల టిడిపి అధ్యక్షుడు సూరాడ మోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మొత్తం తెగనమ్మి, దోచుకొని, ఈరోజు తలదించుకోకుండా నిజాయితీగా పాలన సాగిస్తున్న తెలుగుదేశం-కూటమి నాయకులపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో కనీసం ఒక్కటంటే ఒక్క కార్యక్రమమైనా నిజాయితీగా చేశామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? అని సవాల్ విసిరారు.
నరకం : ఐదేళ్లూ నరకం చూపించారు.. ”రాష్ట్రవ్యాప్తంగా ఒక్క పాడైపోయిన రోడ్డునైనా జగన్ మోహన్ రెడ్డి బాగు చేశారా? అధ్వాన్నపు రోడ్ల వల్ల లక్షలాది మంది ప్రజలు, రోజువారీ కూలీలు, చిన్న వాహనాలు నడుపుకుంటూ జీవించే కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అక్కుపల్లి నుంచి కాశీబుగ్గ వరకు ఉన్న 16 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్డును ఐదేళ్లపాటు కంకర వేసి అలాగే వదిలేశారు. దీనివల్ల ఎంతమంది అనారోగ్యాల పాలయ్యారో, ఎంతమంది నరకం అనుభవించారో వైకాపా నాయకులకు తెలుసా? ఇలాంటి వాళ్లు ఈరోజు రోడ్ల నాణ్యత గురించి మాట్లాడటం దారుణం” అని సూరాడ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మట్టి నింపి వదిలేశారు: గ్రామాల్లోని ప్రతి జంక్షన్‌లో సీసీ రోడ్లు వేయాల్సింది పోయి, కేవలం గ్రావెల్ మట్టి నింపేసి వదిలేశారని.. అటు సీసీ రోడ్డు వేయక, ఇటు బీటీ రోడ్డు వేయక ప్రజలకు నరకం చూపించారని విమర్శించారు. వైకాపా నాయకులు చెప్పే అబద్ధాలను వారి పార్టీ అభిమానులు నమ్మితే నమ్మొచ్చు గానీ, సాధారణ ప్రజలు, కూటమి కార్యకర్తలు మాత్రం వారి మాటలను అసహ్యించుకుంటున్నారని స్పష్టం చేశారు.
కాంట్రాక్టుల కోసమే దోపిడీ: వైకాపా నాయకులకు కేవలం మైనింగ్ లెక్కలు, బిల్డింగుల కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని సూరాడ మోహన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), సచివాలయ భవనాలు, ఆర్బీకే (RBK) బిల్డింగులను ముందే ఒక పెద్ద కాంట్రాక్టర్‌తో మాట్లాడుకుని, భారీ స్థాయిలో అవినీతికి తెరలేపారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు వాస్తవాలు తెలుసుకొని, పరిసరాల పరిస్థితులను గమనించి మాట్లాడాలని, బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
