వామపక్షాల రాస్తారోకోను జయప్రదం చేయండి.
SRIKALAHASTHI (TIRUPATHI) : పెరిగిన గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన శ్రీకాళహస్తి పట్టణంలో వామపక్ష పార్టీలు తలపెట్టనున్న రాస్తారోకోను జయప్రదం చేయాలని సిపిఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో ఆదివారం సిపిఐ, సిపిఎం సంయుక్తంగా రాస్తారోకో కరపత్రాలను ఆవిష్కరించారు.
గడిచిన నెల రోజుల వ్యవధిలో నాలుగు పర్యాయాలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని మణి తెలిపారు. కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు రాయితీలిచ్చిన మోడీ ప్రభుత్వం వినియోగదారులపై ధరల భారాన్ని మోపిందని మండిపడ్డారు. అంబానీ, ఆదానీల కోసం మాత్రమే మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారనీ, ఫలితంగానే దేశ ప్రజలు ధరల భారాలను మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలనీ, స్వచ్చందంగా రాస్తారోకోలో పాల్గొని కేంద్రానికి తమ గళాన్ని బలంగా వినిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ నేతలు మించల శివకుమార్, గోపి, సిపిఎం నేతలు పెనగడం గురవయ్య, రాధమ్మ, అన్వర్ బాషా, వెంకటేష్, గురునాథం తదితరులు పాల్గొన్నారు.
