కంచిలిలో ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమం.
డీఈవో రవిబాబు, డిప్యూటీ డీఈవో విలియమ్స్ పర్యవేక్షణలో నిర్వహణ.
6 రోజులపాటు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ.
కంచిలి జడ్పీ హైస్కూల్ వేదికగా 4 మండలాలు (సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం)కు సంబంధించిన ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి డీ రవిబాబు, డిప్యూటీ విద్యాశాఖాధికారి డీ విలియమ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు.
ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలకు మెరుగులు – విద్యార్థుల్లో పునాది అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర నైపుణ్యాల పెంపే లక్ష్యం:
డీఈవో రవిబాబు మాట్లాడుతూ, ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని, తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచే విధంగా బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. అమ్మ-ఆడబిడ్డ మనం, అంకురం లాంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
కోర్సు డైరెక్టర్లుగా శివరాం ప్రసాద్, చిట్టిబాబు:
ఈ శిక్షణా కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్లుగా స్థానిక ఎంఈఓ – 1, 2 ఎస్ శివరాం ప్రసాద్, కే చిట్టిబాబు వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు కేఆర్పీ, డీఆర్పీ, మండలాల ఎంఈఓలు సైతం పాల్గొని ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
4 మండలాల ఉపాధ్యాయులు హాజరు : సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు 6 రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన బోధనా పద్ధతులు, టీఎల్ఎం వినియోగంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
