ఇచ్ఛాపురం రైల్వే సమస్యల పరిష్కారానికి టీడీపీ వినతి.
జోనల్ మేనేజర్‌కు హాల్టులు, ఆర్వోబీలపై విజ్ఞప్తి.
ఇచ్ఛాపురం: నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్లలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నాయకులు గురువారం ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం జోనల్ రైల్వే మేనేజర్ సందీప్ మధురర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జడ్ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస్ రంగా రౌళో, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్, టీడీపీ నాయకులు కాళ్ల జైదేవ్, సుభాష్ తదితరులు నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను వివరించారు. ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్ ఒత్తిడి, స్టేషన్లలో మౌలిక వసతుల లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రధాన డిమాండ్లు :
ఇచ్ఛాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. జాడుపూడి స్టేషన్‌లో బ్రహ్మపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలుకు హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోంపేటలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నామా, హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్‌తో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బారువలో విశాఖపట్నం–బ్రహ్మపూర్ ప్యాసింజర్‌కు హాల్ట్‌తో పాటు ప్లాట్‌ఫాం ఆధునికీకరణ చేపట్టాలని, మందసలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం కల్పించాలని కోరారు.
అభివృద్ధి చర్యలపై నేతల అభిప్రాయం :
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే రంగ అభివృద్ధికి ప్రాధాన్యం పెరిగిందని నేతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో జిల్లాలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైళ్ల సదుపాయాలపై చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద రాష్ట్రంలోని 73 స్టేషన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని గుర్తు చేశారు. వినతిపత్రాన్ని జోనల్ రైల్వే మేనేజర్ సానుకూలంగా స్వీకరించి సంబంధిత ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ప్రతిపాదిత పనులు అమలైతే ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు
