పాయతారిలో రైతులకు భూ హక్కుల పండుగ
450 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు చేతుల మీదుగా అందజేత
ఇచ్చాపురం: రైతుల భూ హక్కులకు మరింత బలాన్ని చేకూర్చే కీలక కార్యక్రమం గురువారం ఇచ్చాపురం మండలం పాయతారి గ్రామంలో నిర్వహించారు. గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బెందాళం అశోక్ బాబు ఆధ్వర్యంలో సుమారు 450 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాస్ పుస్తకాలు అందుకున్న రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ రైతు భూమికి సంబంధించిన ప్రతి హక్కు చట్టబద్ధంగా రక్షించబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూముల వివరాల ఖచ్చితత్వం, రైతులకు న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగ బలోపేతమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, వారి భూ యాజమాన్య హక్కులకు అధికారిక గుర్తింపు అని అధికారులు వివరించారు. ఈ పుస్తకాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు, భూ వివాదాల పరిష్కారంలో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ దాసరాజు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
