అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి.
బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన నరసన్నపేటలో పర్యటించనున్న నేపథ్యంలో, పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు మరియు పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్, బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి సమగ్రంగా బ్రీఫింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సెక్టార్‌కు తగినంత సంఖ్యలో సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పాయింట్ల వద్ద నిర్ణీత సమయానికి హాజరై, ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకల సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు. సభా ప్రాంగణానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇతర వాహనాలు కూడా కేటాయించిన ప్రదేశాల్లో క్రమబద్ధంగా పార్కింగ్ చేయించేలా చూడాలని తెలిపారు. ప్రజలు మరియు కార్యకర్తల ప్రవేశ, నిష్క్రమణను క్రమబద్ధంగా నిర్వహించాలని, సెక్టార్ ఇన్‌చార్జ్ అధికారులు తమ పరిధిలోని సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట రోప్ పార్టీలు, రూప్ టాప్, స్పెషల్ పార్టీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు ముఖ్యమంత్రి పర్యటన భద్రత కోసం జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో ముగ్గురు అదనపు ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో కలిపి సుమారు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌ను మోహరించి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీ పి. శ్రీనివాసరావు, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
