పెద్దకొజ్జిరియలో విత్తన గులికలపై రైతులకు అవగాహన.
కొబ్బరి తోటల్లో అంతరపంటగా సీడ్ బాల్స్.
సోంపేట డివిజన్ కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో రైతులకు విత్తన గులికల (సీడ్ బాల్స్) తయారీ, ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతుల సమక్షంలోనే విత్తన గులికలు తయారు చేసి, కాంపాక్ట్ బ్లాక్‌లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో బొడ్డ మధుకుమార్, బొడ్డ కిరణ్, పొందల ఢిల్లీరావు, ప్రధాన్ లజపతి, లోల సురేంద్ర కొబ్బరి తోటల్లో లైన్ షోయింగ్ పద్ధతిలో ఐదుగురు రైతులతో విత్తన గుళికలు వేయించారు.
విత్తన గులికల ప్రయోజనాలు:
ఈ సందర్భంగా ఫీల్డ్ మాస్టర్ ట్రైనర్ శివానందం మాట్లాడుతూ, ఈ విధానంలో విత్తనాలు వేయడంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు పడినా మొలకలు బాగా వస్తాయని తెలిపారు. ఎండాకాలంలో వేసినా విత్తనం పాడవకుండా భూమిలో నిక్షేపంగా ఉంటుందని, వర్షాలు పడిన వెంటనే మొలకశాతం పెరుగుతుందని వివరించారు. చీడపీడల బారి నుంచి విత్తనాలను కాపాడటంతో పాటు భూమిలోని సూక్ష్మజీవులు ఎండబారకుండా ఈ గులికలు రక్షిస్తాయని చెప్పారు. తక్కువ వర్షపాతం ఉన్నా రైతుకు అంతరపంట ద్వారా ఆదాయం లభిస్తుందని, నిరంతరం భూమి పచ్చని పంటలతో కప్పి ఉండటం వల్ల తేమశాతం, జీవవైవిధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ సర్పంచ్ పొందల ఢిల్లీరావు, మాజీ సర్పంచ్ బొడ్డ రాంకుమార్, ప్రధాన్ లజపతిరాయ్, బల్లెడ సీతారాం, బొడ్డ జానకిరామ్, బొడ్డ శ్రీరాములు, గ్రామ పెద్దలు, రైతులు, లీడ్ ఫార్మర్స్, అంపురం యూనిట్ ఐసీఆర్‌పీలు, ట్రైనీ ఐసీఆర్‌పీలు హాజరయ్యారు.
