Homeఆంధ్రప్రదేశ్గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.

గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.

SOMPETA: మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఎదిగి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ప్రోత్సహించాలి.

‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యంతో మహిళా సమాఖ్యలో విస్తృత అవగాహన.

గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి ప్రతి కుటుంబాన్ని స్వయం ఉపాధి దిశగా నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సోంపేట మండల మహిళా సమాఖ్య సమావేశంలో విస్తృత అవగాహన కల్పించారు.   మహిళల జీవనోపాధి అవకాశాలను పెంచి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

మండల మహిళా సమాఖ్య నెలవారీ పాలకవర్గ సమావేశం మండల సమాఖ్య అధ్యక్షురాలు బి. జానకి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.   2026-27 వార్షిక ఆర్థిక రుణ ప్రణాళిక,  జీవనోపాధి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో తయారుచేసిన నివేదికలపై సమావేశంలో చర్చించారు.  మండలంలోని 1993 సంఘాలు, 52 గ్రామ సంఘాలకు సంబంధించిన ప్రణాళిక వివరాలను సభ్యులకు తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా  “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్”  నినాదంతో ప్రతి గ్రామ సంఘంలో కనీసం 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి అవసరమైన ఆర్థిక వనరులు, రుణ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఎదిగి కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ప్రోత్సహించాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న సబ్సిడీ రుణాలపై ప్రతి మహిళకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. 35 శాతం సబ్సిడీతో ఆరుకు కాఫీ, కోరమీను, షెడ్‌నెట్, సముద్రపు నాచు (సీవీడ్), పెరటి కోళ్ల పెంపకం, పౌల్ట్రీ, గానుగ నూనె తయారీ వంటి ఉపాధి కార్యక్రమాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని సూచించారు.

అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో లబ్ధిదారుల సంతృప్తి శాతం పెరిగేలా ఐవిఆర్ఎస్ కాల్స్‌పై అవగాహన కల్పించాలని తెలిపారు. “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త వేరు చేసే విధానం ద్వారా ఆదాయం పొందడం, కంపోస్ట్ తయారీపై వివరించారు.

ప్రతి మహిళ ఇంటి వద్ద న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటు చేసి మునగ, బొప్పాయి, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు లేని పంటలను వినియోగించడం ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. గ్రామీణ మహిళల్లో ఆర్థిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి సమావేశాలు కీలకంగా మారుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.  ఈ కార్యక్రమంలో ఎస్. ప్రసాదరావు, ఏపీఎం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీసీలు పాపారావు, గణపతిరావు, గ్రామ సంఘ అధ్యక్షులు, అకౌంటెంట్ భారతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular