ఐదు బిళ్ళల్లో 31 రోజుల గణిత మాయాజాలం.
కొత్త అల్లుడి డిమాండ్‌కు గణితంతో అద్భుత పరిష్కారం.
గణిత అవధాని మడ్డు తిరుపతి రావు వినూత్న గణిత కథనం
కంచిలి : గణితం అనగానే కఠినమైన సూత్రాలు, లెక్కలతో మాత్రమే సంబంధమని భావించే వారికి, కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన గణిత అవధాని, ఉపాధ్యాయుడు మడ్డు తిరుపతి రావు వినూత్న కథనం ద్వారా ఆసక్తికర సందేశాన్ని అందించారు. “కొత్త అల్లుడు ముందు చూపు” పేరుతో రూపొందించిన గణితానందనం కథ ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గణితాభిమానులను ఆకట్టుకుంటోంది.
భావనపాడు గ్రామానికి చెందిన రాముడు–ద్రౌపది దంపతుల కుమార్తె గాయిత్రికి ఇటీవల కోటబొమ్మాళి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు “ఏడు కొండలు” తో వివాహం జరిగినట్లు కథను రూపకల్పన చేశారు. దసరా పండుగ సందర్భంగా అల్లుడిని ఇంటికి ఆహ్వానించగా, “అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఏ రోజు వచ్చినా, ఆ తేదీ సంఖ్యకు సమానంగా గ్రాముల బంగారం ఇవ్వాలి” అని అల్లుడు కోరినట్లుగా కథ సాగుతుంది. దీనితో ఆందోళన చెందిన అత్తమామలు మొదట 1 గ్రాము నుంచి 31 గ్రాముల వరకు మొత్తం 31 బంగారు బిళ్ళలు తయారు చేయించాలని భావిస్తారు. అయితే బంగారు వ్యాపారి తన గణిత ప్రతిభతో కేవలం ఐదు బిళ్ళలతోనే సమస్యకు పరిష్కారం చూపిస్తాడు.
ఆ ఐదు బిళ్ళల బరువులు వరుసగా 1, 2, 4, 8, 16 గ్రాములుగా ఉంటాయి. ఈ బిళ్ళలను అవసరానికి అనుగుణంగా కలిపి 1 నుంచి 31 వరకు ఏ సంఖ్యనైనా రూపొందించవచ్చని వివరించారు. ఉదాహరణకు 7 గ్రాములు ఇవ్వాలంటే 1+2+4 గ్రాముల బిళ్ళలు, 15 గ్రాములకు 1+2+4+8 గ్రాముల బిళ్ళలు, 31 గ్రాములకు ఐదు బిళ్ళలన్నింటినీ కలిపి ఇవ్వవచ్చని తెలిపారు.
సాధారణ కుటుంబ కథనం ద్వారా ద్విమాన సంఖ్యా విధానం (బైనరీ సిస్టమ్) ప్రాముఖ్యతను ఎంతో సరళంగా వివరిస్తూ రూపొందించిన ఈ గణిత కథనం విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంపొందించడమే కాకుండా, గణితంపై ఆసక్తిని కలిగిస్తోందని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని గణితాన్ని జీవితానుభవాలతో మేళవించి అందించిన ఈ వినూత్న ప్రయత్నం ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
