సునీల్ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపే.
రాష్ట్రంలో అమలవుతోంది ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’
కూటమి వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు.
కంచిలిలో ఎమ్మెల్సీ నర్తు రామారావు తీవ్ర విమర్శలు.
కంచిలి: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనకు బదులుగా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని, వైఎస్సార్సీపీ నాయకులపై నమోదవుతున్న కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్ అరెస్ట్ అక్రమమని పేర్కొంటూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.
కంచిలి మండల కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ వర్గానికి చెందిన యువనేత సునీల్‌కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా మద్యం కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్సార్సీపీ నాయకులను వేధించడం దురదృష్టకరమని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని నర్తు రామారావు విమర్శించారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళలకు ప్రకటించిన పథకాల అమలులో నిరాశ నెలకొందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నుంచి దృష్టి మళ్లించేందుకే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగాయని, ప్రస్తుతం మద్యం సీసాలపై అదనపు భారం మోపుతూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో లాకప్ మరణాలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆందోళనలు, నిరుద్యోగ యువత సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి సారించడం లేదని ఆయన అన్నారు. అమరావతి రైతులు, ఆక్వా రైతులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంటూ, ‘సూపర్ సిక్స్’ హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలు ప్రమాదకరమని, అక్రమ అరెస్టులు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ నాయకులను భయపెట్టలేరని నర్తు రామారావు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజల తీర్పు కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.
సమావేశంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ గుమ్మడి రామదాసు, సంజయ్ శర్మ (టిల్లు),తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
