KANCHILI : ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
కంచిలి మండలంలోని ఎంఎస్ పల్లి ఏపీ మోడల్ స్కూల్ నుంచి అరవసరియాపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై 11 కేవీ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వాలిపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రహదారి పక్కనే ఉన్న ఈ స్తంభం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. ప్రతిరోజూ ఈ మార్గంలో మోడల్ స్కూల్ విద్యార్థులు, రైతులు, ద్విచక్ర వాహనదారులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, గాలులకు స్తంభం మరింత వంగిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ప్రమాద సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. గతంలో అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి తూతూమంత్రంగా హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగేలోపు వాలిపోయిన స్తంభాన్ని వెంటనే సరిచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
