రీసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం.. రైతుల్లో ఆనందం
అర్జునాపురంలో వేగంగా కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియ
పారదర్శక భూ రికార్డుల దిశగా ప్రభుత్వ కీలక అడుగు
KANCHILI : కంచిలి మండలంలోని యక్కల గ్రామపంచాయతీ పరిధిలోని అర్జునాపురం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పునః రీసర్వే ప్రక్రియ రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. దశాబ్దాలుగా భూముల సరిహద్దులు, రికార్డుల్లోని వ్యత్యాసాలు, యాజమాన్య వివాదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఈ రీసర్వేతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేశరపాడు సచివాలయ పరిధిలో సర్వేయర్లు జయప్రకాష్, పూర్ణ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో భూముల కొలతలు చేపడుతున్నారు. ప్రతి సర్వే నంబర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ భూముల వాస్తవ స్థితిగతులను నమోదు చేయడం రైతుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. భూముల సరిహద్దులపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడటంతో పాటు యాజమాన్య హక్కులు స్పష్టంగా నమోదు కానుండటంతో భవిష్యత్తులో వివాదాలకు తావుండదని రైతులు భావిస్తున్నారు.
రీసర్వే పూర్తయిన అనంతరం భూ రికార్డులు మరింత ఖచ్చితత్వంతో అందుబాటులోకి రావడం వల్ల రైతులకు రుణాల మంజూరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, భూ లావాదేవీల నిర్వహణలో సౌలభ్యం కలుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. భూమికి సంబంధించిన అధికారిక రికార్డులు పారదర్శకంగా మారడం వల్ల రైతులకు భద్రత, నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.
ఈ సందర్భంగా బుడ్డెపు కామేష్ రెడ్డి మాట్లాడుతూ రైతుల దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమం అభినందనీయమన్నారు. భూ రికార్డుల పారదర్శకత పెరగడంతో పాటు రైతుల హక్కులు మరింత బలోపేతం అవుతాయని, భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అర్జునాపురంలో రీసర్వే పనులు వేగంగా కొనసాగుతుండగా రైతులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని, రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలకు ఈ రీసర్వే ఒక శాశ్వత పరిష్కార మార్గంగా నిలుస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
