కర్నూలు : కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని, ప్రతి రోగి వివరాలను ఆబా పోర్టల్ లో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్ మందుల అందుబాటు, ఔషధాల నిల్వలు, సిబ్బంది హాజరు, ఫార్మసీ నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మందుల నిల్వలు, వాటి వినియోగ విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజువారీగా ఎంతమంది ఓపీకి వస్తున్నారు? ఏ రకాల వ్యాధులతో చికిత్స కోసం ప్రజలు వస్తున్నారు? అనే అంశాలపై వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు సుమారు 30 నుంచి 50 మంది వరకు ఓపీకి వస్తున్నారని, ప్రధానంగా బీపీ, షుగర్, ఒళ్ళు నొప్పులు, కుక్క కాటు కేసులు, వడదెబ్బలకు సంబంధించిన సమస్యలతో ప్రజలు చికిత్స కోసం వస్తున్నారని వివరించారు.
ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రతి రోగి వివరాలను ఆబా (ABHA) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఆరోగ్య సేవల్లో డిజిటల్ నమోదు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, రోగుల ఆరోగ్య సమాచారం సమగ్రంగా నమోదైతే భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆసుపత్రికి వచ్చిన రోగులు మరియు వారి కుటుంబ సభ్యులతో కూడా కలెక్టర్ మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారని, చికిత్స సంతృప్తికరంగా ఉందని ప్రజలు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
