అక్కుపల్లిలో హోరెత్తిన ‘స్వర తరంగాలు’..!
గాన గంధర్వి ఎస్. జానకమ్మకు ఉద్దాన కళాకారుల అపూర్వ నీరాజనం
శృతిలయల సామ్రాజ్ఞి ఆమె: మోస వరప్రసాద రావు
నాలుగు గంటల పాటు వీనుల విందుగా సాగిన మధుర గీతాలు
కన్నుల పండువగా ‘స్వర నివాళి’ సంగీత విభావరి
వజ్రపుకొత్తూరు, (తేజేష్ టీవీ న్యూస్): “శృతిలయల సామ్రాజ్ఞిగా, గాన మాధుర్యాల గనిగా సినీ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన స్వర యోగిని ఎస్. జానకమ్మ. ఎలాంటి డిజిటల్ హంగులు లేని కాలంలోనే తన స్వరంతో ఇంద్రజాలం చేసిన అద్భుతమైన గాయని ఆమె. పసిపాప మొదలు పండు ముసలి వరకు ఏ వయసు పాత్రకైనా తన గొంతును అలవోకగా మార్చి అక్షరాలకు ప్రాణం పోసిన బహుముఖ ప్రజ్ఞాశాలి,” అని శ్రీ రామా సేవా సంఘం అధ్యక్షులు మోస వరప్రసాద రావు కీర్తించారు.
గాలిలో ఆమె పాటలు వినిపిస్తున్నంత కాలం జానకమ్మ మన గుండెల్లో చిరంజీవిగానే ఉంటారని ఆయన ప్రశంసించారు. భావగర్భిత గానానికి చిరునామా అయిన ఆ సంగీత సరస్వతికి వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో ఘనంగా ‘స్వర నివాళి’ అర్పించారు.ఉద్దాన కళాకారుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రామా సేవా సంఘ భవనం వేదికగా సోమవారం ఈ స్వర సంబరం అంబరాన్నంటింది. కార్యక్రమం ప్రారంభంలో జానకమ్మ చిత్రపటానికి సభికులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి ఘటించారు. అనంతరం శ్రీ రామా సేవా సంఘం వారు ప్రత్యేకంగా సమకూర్చిన అద్భుతమైన లైటింగ్, డిజిటల్ సౌండ్ సిస్టం నడుమ.. ఈ వేడుక సుమారు నాలుగు గంటల పాటు వీనులవిందుగా సాగింది.
ఉద్దాన ప్రాంత ప్రతిభావంతులైన కళాకారులు జానకమ్మ పాడిన ఆణిముత్యాల్లాంటి గీతాలను తమ మధుర గాత్రంతో పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. శ్రోతల కరతాళ ధ్వనుల మధ్య సభా ప్రాంగణం ఆద్యంతం కోలాహలంగా సాగింది. ఈ అద్భుత కార్యక్రమంలో గాయనీ గాయకులు మడ్డు శంకర్, శిస్టు రామ్ మనోజ్ కుమార్, కాస గీత, కోడ నాగమణి, గుంటూ జ్యోతి, జోగి పున్నయ్య, మడ్డు ఉషారాణి, విమల, లక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొని తమ గానంతో విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ స్వర నివాళిలో శ్రీ రామా సేవా సంఘం కోశాధికారి కాస చలపతి రావు, సంయుక్త కార్యదర్శి మడ్డు మురళీకృష్ణ, ప్రతినిధులు సింగుపల్లి బాలకృష్ణ, కాస ముకుందరావు, సూరాడ లోకనాధం, పిన్నాసి శ్రీకాంత్, మడ్డు వాసుదేవ్, కాస సోమశేఖర్, కోనేరు లోకనాధం నాయుడు, కాస వెంకటస్వామి, మడ్డు మాలయ్య, మోస కుమారస్వామి, చొక్కర జానకిరావు, కుంది రాజా తదితరులతో పాటు భారీ సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు, సంగీతాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
