సమాజ సేవకుడు , కళాకారుడు మోస వరప్రసాదరావుకు ఆత్మీయ సత్కారం.

PALASA (Belai):రంగస్థల కళాకారుడు, సామాజిక సేవకుడు, అక్కుపల్లి శ్రీ రామా సేవా సంఘం అధ్యక్షులు మోస వరప్రసాదరావుకు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నెహ్రూ సాంస్కృతిక భవనంలో ప్రవాసాంధ్ర ప్రజా నాట్య మండలి - భిలాయ్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగినది.

0
88

సమాజ సేవకుడు , కళాకారుడు మోస వరప్రసాదరావుకు ఆత్మీయ సత్కారం.

 కళారంగానికి మరియు సమాజానికి వారు చేసిన సేవలు ప్రశంసనీయం.

ఛత్తీస్‌గఢ్‌ (భిలాయ్) : మహాకవి శ్రీశ్రీ స్థాపించిన ప్రజానాట్యమండలి భావజాలంతో, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు కలసి ప్రజా నాట్య మండలిగా ఏర్పడి గత 46సంవత్సరాలు నుండి కళారంగానికి మరియు సామాజిక సేవలకు విశేష కృషి చేయడం అభినందనీయం.  ఈ సందర్భంగా రంగస్థల కళాకారుడు, సామాజిక సేవకుడు, అక్కుపల్లి శ్రీ రామా సేవా సంఘం అధ్యక్షులు మోస వరప్రసాదరావుకు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నెహ్రూ సాంస్కృతిక భవనంలో ప్రవాసాంధ్ర ప్రజా నాట్య మండలి – భిలాయ్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగినది.

ఈ సన్మాన సభా కార్యక్రమం ప్రముఖ కవి, రచయిత, రంగస్థల నటులు మొరిపల్లి బాబురావు మాస్టర్ సభాధిపతిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కవి ,రంగస్థల నటులు వడ్డి అప్పారావు తన కవితలతో అలరించారు. గాయకులు బర్రి ఈశ్వరరావు, చీగటి గణపతి తమ మధురమైన గాత్రంతో సభను ఉర్రుతలూగించారు. ఈ సందర్భంగా ప్రవాసాంద్ర ప్రజా నాట్య మండలి అధ్యక్షులు, ప్రముఖ సినీ నటులు, కవి, రచయత ,సి.నారాయణ రెడ్డి అవార్డు గ్రహీత , బహుముఖ ప్రజ్ఞశాలి లండ రుద్రమూర్తి మాస్టర్ మాట్లాడుతూ కళాకారుడు ఎప్పుడూ సమాజ సేవలో పునీతమై ఉంటారని ఇటు కళారంగానికి ,అటు సామాజిక సేవా రంగాల్లో మోస వరప్రసాదరావు అందిస్తున్న సేవలు ఎందరికో ఆదర్శనీయమని పేర్కొన్నారు.

మరో కళాకారుడు కవి, రచయిత, టీటిడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గాయకుడు సాగూరు నారాయణ స్వామి మాట్లాడుతూ నాటికలు,నాటకాలు ప్రదర్శించడమే కాకుండా , కళాకారులను ప్రోత్సహించడంలో వరప్రసాద్ ఎల్లప్పుడూ ప్రథమ వరుసలో ఉంటారని కొనియాడారు. సమాజ సేవలో పార్టీలకు అతీతంగా ప్రజలకు, ముఖ్యంగా వికలాంగులకు ఆయన చేసిన సేవలు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయని అందుకే అతి చిన్న వయస్సులో అక్కుపల్లి గ్రామ సంఘం అధ్యక్షులుగా గ్రామ శ్రేయస్ కొరకు యెనలేని సేవలు అందిస్తూ ప్రజలు మన్నలను పొందుతున్నారని ప్రశంసించారు.

ప్రముఖ సినీ, రంగస్థల కళాకారుడు, కవి , గాయకుడు బర్రి ఈశ్వరరావు ప్రసంగిస్తూ మోస వరప్రసాదరావు తండ్రి, స్వర్గీయ మోస దొరస్వామి అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో అద్భుతమైన ప్రదర్శనలు రంగస్థలంపై సమాజానికి అందించారని గుర్తుచేశారు. తండ్రి అందించిన ఆదర్శవంతమైన వారసత్వాన్ని, మంచి స్వభావాన్ని పునికిపుచ్చుకున్న వరప్రసాద్ కళాకారులను ప్రోత్సహించడం , సామాజిక సేవలో రాణించడం అభినందనీయమన్నారు. గాయకుడు ,కళాకారుడు మొరిపల్లి ధర్మారావు ప్రస్తావిస్తూ స్వర్గీయ మోసా దొరస్వామి రంగస్థలంపై ఉన్న మక్కువతో భిలాయ్ లోని బి.ఎస్.పి ఉద్యోగాన్ని సైతం వదలి, నటుడిగా, రైటర్‌గా గుర్తింపు పొందారని అదే బాటలో ఆయన కుమారుడు మోస వరప్రసాదరావు పయనించడం శుభపరిణామన్నారు. సభలో మరికొంతమంది వక్తలు ప్రసంగిస్తూ కళామతల్లికి సేవలందించడం, మరుగున పడుతున్నకళలకు ప్రోత్సాహం అందించడం అలాగే సమాజంలో ప్రజలకు అనునిత్యం సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

సన్మాన గ్రహీత మోసా వరప్రసాదరావు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రవాసాంధ్ర ప్రజా నాట్య మండలి వారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ ఆత్మీయ సభా వేదికపై నా తండ్రి స్వర్గీయ మోస దొరస్వామి గారి రంగస్థల సేవలను స్మరించుకోవడం నా పూర్వ జన్మ సుకృతమని భావోద్వేగానికి లోనయ్యారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తెలుగు మహాసభలు, ఉగాది పురస్కారాలు, పరిషత్ నాటకాలు నిర్వహిస్తూ, వేలాది మంది కళాకారులను తీర్చిదిద్ది సినీ రంగానికి సైతం పరిచయం చేసి తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రులచే ప్రశంసలు అందుకోవడం , ఎన్నో అవార్డులు సైతం కైవసం చేసుకొని కళామ తల్లికి సేవలు అందిస్తున్న ప్రవాసాంధ్ర ప్రజా నాట్య మండలి అధ్యక్షులుకు , సభ్యులేవన్మందికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

తెలుగు సంస్కృతిని, కళలను పరాయి రాష్ట్రంలోనూ సజీవంగా ఉంచుతూ, సమాజ సేవకులను గౌరవించుకుంటున్న భిలాయ్ ప్రవాసాంధ్రుల ప్రజా నాట్య మండలి కృషి నిజంగా అభినందనీయమని పలువురు వ్యక్తపరిచారు. ఈ వేడుకలో ప్రవాసాంద్ర ప్రజా నాట్య మండలి అధ్యక్షులు లండ రుద్రమూర్తి మాస్టర్, ఉపాధ్యక్షులు మొరిపల్లి బాబురావు మాస్టర్, కార్యదర్శి CH శ్రీనివాస్, సభ్యులు సాగూరు నారాయణ స్వామి, మొరిపల్లి ధర్మారావు, బర్రి ఈశ్వరరావు, మడ్డు జానకిరావు, యంపళ్ళ అప్పలస్వామి, బైపల్లి అప్పారావు, కృష్ణమూర్తి, తమ్మారావు తదితరులు పాల్గొన్నారు.